హైదరాబాద్ – సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత రేపు. హాజరుకావడంలేదు. సీబీఐ విచారణకు ఎందుకు రావడం లేదోనని సుదీర్ఘ లేఖ రాసింది కవిత. కాగా.. లిక్కర్ స్కాం కేసులో రేపు తమ ముందు హాజరు కావాలని కవితకు సీబీఐ 41ఏ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాసింది. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించింది ఎమ్మెల్సీ కవిత. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండని తెలిపారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు.. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని అన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది.. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అన్నారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని ప్రస్తావించారు