సిరిసిల్ల, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్) : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, ఉపాధి కోసం ఆర్డర్లు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరని నేపథ్యంలో నేతన్నలు తిరిగి పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జరిగిన ఈ సమావేశంలో సోమవారం నుంచి ఆందోళన పునః ప్రారంభించాలని, ఇందులో భాగంగా దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్, పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి మూషo రమేష్ మాట్లాడుతూ… వస్త్ర పరిశ్రమ సమస్యలపై తాము పోరాటం సాగిస్తుండగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డిల సమక్షంలో జేఏసీ సమావేశంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై జేఏసీ చేసిన పోరాట ఫలితంగా గత 10 రోజుల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ నాయకులతో సమావేశమై సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, వారం రోజుల వరకు పెండింగ్ బిల్లులు, సబ్సిడీ డబ్బులు అందిస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం వలన జెఎసి పోరాటాన్ని తాత్కాలికంగా విరమణ చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ పది రోజులు గడిచినా మంత్రిగారు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడంతో జేఏసీ లోని అన్ని సంఘాల నాయకులు మళ్లీ పోరాటాన్ని ప్రారంభించాలని ఏప్రిల్ 22 సోమవారం రోజున పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించి ప్రకటించారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మూశం రమేష్, నాయకులు సిరిసిల్ల రవీందర్ లు మాట్లాడుతూ… సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి ఉపాధి కల్పించి సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి లు సిరిసిల్లలో జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారం రోజుల వరకు యజమానులకు రావలసిన పెండింగ్ బిల్లులు, కార్మికులకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు అందించే విధంగా చూస్తామని, గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉపాధి అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం వలన జెఎసి గా పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కానీ మంత్రి ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో మళ్లీ పోరాటం ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
ఏప్రిల్ 22 సోమవారం రోజున పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, సబ్సిడీ డబ్బులు అందించి ఉపాధి కల్పించాలని పెద్ద ఎత్తున దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. కార్మికులకు తక్షణ ఉపాధి కల్పనకు బతుకమ్మ చీరల ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని కన్వీనర్ మూషo రమేష్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్య తీసుకురావడం కోసమే తిరిగి ఆందోళన చేపడుతున్నట్లు జేఏసీ వెల్లడించింది. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు పంతం రవి, మండల సత్యం, తాటిపాముల దామోదర్, మంచే శ్రీనివాస్, గోలి వెంకటరమణ, యేల్దoడి శంకర్, కోడం రమణ, సిరిమల్ల సత్యం, అశోక్, మండల రాజు, పిస్క మధు, వెల్దండి దేవదాస్, మోర రాజు, బండారి అశోక్, శ్రీరామ్ సత్యం, ఏనుగుల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.