హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్టీ) నోటిఫికేషనే వెలువడలేదు. చివరిసారిగా 2017 అక్టోబర్ 21న 8792 పోస్టులకుగానూ టీఆర్టీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వేస్తే మళ్లి ఇంత వరకు దాని ఊసేలేదు. ప్రభుత్వ బడుల్లో టీచర్ ఖాళీలను నింపుతామని గత మార్చి నెలలో ప్రకటించిన ప్రభుత్వం నేటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇతర శాఖల్లోని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను దశలవారీగా విడుదల చేస్తున్న ప్రభుత్వం…పాఠశాల విద్యాశాఖలోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ముందడుగు వేయడంలేదు. టెట్ ఫలితాలు వెల్లడించి ఇప్పటికే నెలలు గడుస్తున్నా ఇంత వరకూ టీచర్ పోస్టుల భర్తీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు రాష్ట్రంలో టీచర్ ఖాళీలు ఎన్ని ఉన్నయానేదానిపై కూడా స్పష్టత లేదు. అన్ని ప్రభుత్వ బడుల్లో కలిపి సుమారు 21వేల వరకు టీచర్ పోస్టులు ఉన్నట్లు ఉపాద్యాయ సంఘాలు అంచానా వేస్తున్నాయి. కానీ ప్రభుత్వం గత మార్చి నెలలో ప్రకటించింది మాత్రం 13,086 పోస్టులు మాత్రమే. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ).. తెలంగాణలో 16,122 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత ఏప్రిల్ 20న జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో 11348, ఉన్నత పాఠశాలల్లో 4774 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన 13,086 పోస్టుల్లో నాన్ టీచింగ్ పోస్టులు పోగా మిగిలిన వాటిలో 11వేల వరకు టీచర్ పోస్టులుంటే, వాటిలోనూ ఎస్‌జీటీ పోస్టులు 6400 వరకు, ఎస్‌ఏ పోస్టులు 3600 వరకు ఉన్నట్లు సమాచారం. పదోన్నతులు ఇస్తే మరో 10వేల వరకు ఖాళీలు ఏర్పడాతాయని అంచనా. అసలు పోస్టులు ఎంత ఉన్నాయనే దానిపై విద్యాశాఖ ఒక స్పష్టత ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గ్రూప్-1, పోలీసు, తాజాగా ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్లు ఇతర పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసి నియామక ప్రక్రియను చేపడుతోంది. కానీ ఇంత వరకు టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇవ్వక పోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టీఆర్టీ నోటిఫికేషన్‌కు చాలా సమస్యలు అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. 317 జీవో అమలు సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారానికి నోచుకునేలేదు. పీఈటీ, పండిట్ అప్‌గ్రేడేషన్ సమస్య అపరిష్కృతంగానే ఉంది. ఈ వేసవిలో పదోన్నతులు, బదిలీలు ప్రక్రియను చేపడతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించినా ఇంత వరకు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఇవన్నీ పరిష్కారం కాకుండా టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు. మరోవైపేమో టీచర్ పోస్టుల కోసం దాదాపు 4.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. 2017లో వేసిన టీఆర్టీ పరీక్షను 3.5 లక్షల మంది రాశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి: రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు టీఆర్‌టీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని 15వేలకుపైగా ఖాళీలను వెంటనే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. టెట్ ముగిసిన తర్వాత టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం టెట్ ముగిసిన తర్వాత టీఆర్టీపై ఎలాంటి ముందడుగు వేయడంలేదు. టీచర్ ఖాళీలపైన కూడా స్పష్టత ఇవ్వాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.