Tuesday, November 19, 2024

TRS యంగ్‌ తరంగ్‌.. యవత ఓట్లకు గాలం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించాలని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. యువతను ఆకర్షించి వారిని పెద్దఎత్తున పార్టీలోకి తీసుకోవాలని తద్వారా బలోపేతమవుతుందన్న భావనతో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో యువతీ యువకుల ఓట్లే కీలకం కావడంతో ఈ దిశగా ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజులుగా పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కేసీఆర్‌ వచ్చే ఏడాదంతా పార్టీకి కీలకమని ఈ సమయంలో ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి క్షేత్రస్థాయిలో మకాం వేసి ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలను రూపొందించాలని సంకల్పించినట్టు కేసీఆర్‌ వివరించారని సమాచారం. నిఘా వర్గాల ద్వారా ఆయా అసెంబ్లి నియోజకవర్గాలు, జిల్లాల్లో నిర్వహించిన సర్వే నివేదికల ఆధారంగా పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ముఖ్య నేతలను ఎంపిక చేసి అక్కడికి పంపాలని భావిస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన గత ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యేక పరిస్థితుల్లో వారంతా తెరాస గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని గత ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేసి ఓటమి పాలైన వారికి ప్రస్తుత ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరిగిపోతోందని దీన్ని నియంత్రించకపోతే ఇబ్బందులు వస్తాయని ఆయా జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసిన సందర్భంలో చెప్పినట్టు సమాచారం. ఇందులో కొంత మంది నియోజకవర్గంలో పరిస్థితిపై నివేదిక అందించినట్టు కూడా చెబుతున్నారు. మరికొన్ని జిల్లాల్లో మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు పొసగడం లేదని దీంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారని గుర్తించిన అధినేత నష్ట నివారణ చర్యలకు దిగాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని తెరాస వర్గాలు చెబుతున్నాయి.

యువత ఓట్లే కీలకం..

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ ఈ ఏడాది ఓటు హక్కు లభిస్తోంది. పాలిటెక్నిక్‌తో పాటు వివిధ వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఓట్లు సైతం వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి. తెలంగాణ ఉద్యమ అంశాలను యువతరానికి తెలియజెప్పి తద్వారా వారిని పార్టీవైపు ఆకర్షితులను చేసేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్‌ తనను కలిసిన తెరాస సొషల్‌ మీడియా విభాగానికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన దాదాపు 15 లక్షల మంది యువతీ యువకులకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వస్తోందని ఈ యువతకు తెలంగాణ ఉద్యమం, ఈ ఉద్యమంలో తెరాస పాత్ర, రాష్ట్రావిర్భావం, తదితర అంశాలను తెలియజేసేందుకు వీలుగా నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్న ప్రతిపాదనలపై చర్చించినట్టు తెలుస్తోంది. నూతన విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభం కావడంతో వచ్చే రెండు, మూడు నెలల్లో సదస్సులు, చర్చాగోష్టులు నిర్వహించి ఈ కార్యక్రమాలకు విద్యార్థులను పెద్దఎత్తున రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ బాధ్యతను స్థానిక పార్టీ నేతలకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. యువతను పార్టీవైపు తిప్పుకునేందుకు వీలుగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వారిని ఎలా చైతన్యవంతం చేయాలన్న అంశాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటికే కేసీఆర్‌కు నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. ట్విటర్‌, ఇనస్ట్రాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌తో పాటు ఎఫ్‌ఎం రేడియోలో తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ పోరాటం, ఉద్యమ నేపథ్యంపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని దీనికి తోడు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో చిన్నపాటి బుక్‌లెట్‌లను ముద్రించి వాటిని ప్రతి ఒక్క విద్యార్థికి, యువతకు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలను మొదలు పెట్టాలని కేసీఆర్‌ తనను కలిసిన ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ముఖ్య నేతలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించే అంశాన్ని కీలకంగా పరిగణిస్తున్న కేసీఆర్‌ త్వరలో ఏర్పాటు చేసే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చించి జిల్లా పార్టీ అధ్యక్షులకు సూచనలు ఇస్తారని పార్టీ నేతలు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన చరిత్ర లేదని తెలంగాణలో మళ్లి విజయం సాధించి సత్తా చాటాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. అసెంబ్లి ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉందని ఈ ఏడాదంతా ప్రజలతో మమేకమై వారి కష్టాలు, ఇబ్బందుల్లో పాలుపంచుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత చేరువయ్యేలా చేయాలని కేసీఆర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. మంత్రులు మొదలుకొని బూత్‌ కమిటీల సభ్యుల వరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ప్రజల మధ్యలో ఉండాలని ఇందుకు సంబంధించిన ప్రణాళికను పార్టీ రాష్ట్ర కార్యాలయం రూపొందించి జిల్లా కమిటీ అధ్యక్షులకు పంపిస్తుందని కేసీఆర్‌ వివరించినట్టు సమాచారం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement