Tuesday, November 26, 2024

కేంద్రం తీరుపై కుత్బుల్లాపూర్ లో టీఆర్ఎస్ నిరసనలు

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా, తెలంగాణ యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినందుకు నిరసనగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మలోని జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి ప్లకార్డులు పట్టుకొని భారీ ర్యాలీ తీసి గండిమైసమ్మ చౌరస్తా వద్ద నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు.. బీజేపీ కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని తీసుకోవాలని, అన్ని పంటలకు ఎం.ఎస్.పి ( మినిమం సపోర్ట్ ప్రైజ్) కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ కు మద్దతుగా రిజిస్టర్ ఏర్పాటు చేసి సంతకాలు చేశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలు విషయంలో బడా మాటలు మాట్లాడిన బండి సంజయ్ కి దమ్ముంటే కేంద్రంలో ఉన్న మోడీని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్‌రెడ్డి తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడకుండా మాయమాటలు చెబుతున్నారని అన్నారు. రైతులను రెచ్చగొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని బండి సంజయ్ చేసిన కుట్రను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అండగా ఉంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమ‌న్నారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలను సీఎం కేసీఆర్ నుండి దూరం చేయాలని బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని, కానీ రైతులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తామని రాతపూర్వకంగా చెప్పేంత వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రవి యాదవ్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల చైర్మన్లు, NMC మేయర్, డెప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, కుత్బుల్లాపూర్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement