న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు రాజ్యసభ ఛైర్మన్‌కు వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. కొన్ని దశాబ్దాలుగా దేశంలో కుల గణన జరగలేదని నామా స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళారు.
వచ్చే జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేయాలని పట్టుబట్టారు. ఈ అంశంపై లోక్‌సభలో చర్చించాలని ప్రత్యేకంగా విన్నవించినా ఓంబిర్లా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. చట్టసభల సభ్యులపై ఎంతో నమ్మకంతో ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి తమను పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.