న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గిరిజన రిజర్వేషన్ బిల్లు అంశంపై తప్పుదోవ పట్టించేలా జవాబిచ్చిన కేంద్రమంత్రిని బర్తరఫ్ చేయాలని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఇచ్చిన సమాధానంపై బుధవారం ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. అనంతరం ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత ఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే మాట్లాడుతూ… పార్లమెంట్‌లో ఏం జరిగినా సభను తప్పుదోవ పట్టించవద్దని, అది పెద్ద నేరమని అభిప్రాయపడ్డారు.
మంత్రి ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టించారన్నారు. 2017లో గిరిజన శాఖ డిప్యూటీ సెక్రటరీ హోంశాఖకు లేఖ రాశారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి బిల్లు ఉందని కేంద్రానికి తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సమాధానమిచ్చారని ఆరోపించారు. గిరిజనుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉందని, మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం పూర్తిగా సభను తప్పుదోవ పట్టించేలా ఉందని అన్నారు. కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడును బర్తరఫ్ చేసి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ పంపిన బిల్లును ఆమోదించాన్నారు.
పార్లమెంట్‌లో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలు పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పరని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డ ఎద్దేవా చేశారు. గిరిజనుల అంశంపై ఒక్కరు కూడా మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ గమనిస్తున్న తెలంగాణా ప్రజలు బీజేపీ ఎంపీలను బట్టడదీసి కొడతారని మండిపడ్డారు. ఇంత అవమానం జరిగినా ఒక్కరూ మాట్లాడడం లేదని ఎంపీ ధ్వజమెత్తారు.
ఎస్సీలు, బీసీలకు న్యాయం చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును 2017లో కేంద్రానికి పంపించామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ అంశంపై ఉభయ సభల్లో అనేక సార్లు చర్చను లేవనెత్తామని, సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖలు రాసి చర్చించారని ఆయన చెప్పారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి కూడా కేంద్రానికి లేఖలు రాసి కేంద్రంతో చర్చలు జరిపారని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యలో ఇలాంటి తప్పుడు మాటలు చెప్పడమే కాకుండా లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారని దుయ్యబట్టారు.
గిరిజన బిడ్డలు, తెలంగాణ మీద అక్కసుని వెళ్లగక్కారన్న నామా, అసెంబ్లీ తీర్మానం పంపితే రాలేదంటే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి మీద చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ నోటీసు ఇచ్చామని ఆయన తెలిపారు. ఏ పార్లమెంట్ సాక్షిగా అయితే తప్పుడు ప్రకటన చేశారో అదే పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గిరిజనుల రిజర్వేషన్లను అడ్డుకోవడం బాధాకరమన్న ఆయన, ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
కేంద్ర మంత్రి సమాధానంతో యావత్ తెలంగాణ గిరిజనులు కలత చెందారని ఎంపీ మాలోత్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. మా రిజర్వేషన్లు మాకు ఇవ్వాలంటే ఇలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రశ్న అడిగిన వాళ్ళు, సమాధానం చెప్పిన కేంద్ర ప్రభుత్వంలోని మరో మంత్రి కిషన్ రెడ్డి ఆనాడు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారని కవిత గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వమంటే పాలించే వాళ్ళా? తెలంగాణ ప్రజలను పీడించే వాళ్ళా? అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. కేంద్రమంత్రి సమాధానంతో పార్లమెంట్, శాసనసభను అవమానించారన్నారు. గిరిజనలను ఓట్ల రూపంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయని, సీఎం కేసీఆర్ అనేక తండాలను గ్రామ పంచాయితీలు చేసి అభివృద్ధిలోకి తెస్తున్నారని వివరించారు. తమకు రావాల్సిన రిజర్వేషన్లు రాకుండా ఇలా అడ్డుకోవడం సరి కాదని అభిప్రాయపడ్డారు. గిరిజనులతో పెట్టుకుంటే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.