Thursday, November 21, 2024

బండిపై భగ్గుమంటున్న టీఆర్ ఎస్ లీడర్లు..

హైదరాబాద్‌, ప్ర‌భన్యూస్: బండి యాత్రపై టీఆర్‌ఎస్‌ భగ్గుమంది. సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు బండి సంజయ్‌ యాత్ర ఉద్రిక్తతల మధ్య సాగగా, బండి తీరుపై టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. నల్లగొండ రైతులపై బండి సంజయ్‌ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ వందకార్లలో గుండాలను తీసుకొచ్చి రైతులపై దాడి చేస్తున్నారన్నారు. ఆరేళ్ళుగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళు సజావుగా జరుగుతున్నాయని, ప్రశాంతంగా ఉన్న జిల్లాలో బండి సంజయ్‌ చిచ్చు పెడుతున్నారన్నారు.

ధాన్యం సేకరణపై పాలసీ చెబితేనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తెలంగాణలో తిరగనిస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరఫున వెంటాడతాం, వేటాడుతామని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాత్రి టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, గ్యాదరి కిషోర్‌, పైళ్ళ శేఖర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

నల్గొండ రైతులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర భారతదేశంలో ధాన్యం కొనుగోలు చేస్తూ దక్షిణ భారతదేశంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని సంజయ్‌ను ఆయన ప్రశ్నించారు. యుపిలో కార్లతో తొక్కించి రైతులను చంపారు.. నల్లగొండలో రాళ్ళు, కర్రలతో దాడిచేసి రైతులను గాయపరిచారు.. బండి ఏ పాలసీతో ఆ పర్యటన చేశారని పల్లా మండిపడ్డారు. పంజాబ్‌లో కొన్నట్లు తెలంగాణ ధాన్యం కొనాలని, లేదంటే రైతుల పక్షాన పోరాడుతామన్నారు.

బండి సంజయ్‌ బందిపోటు యాత్ర చేశారని, నల్లగొండ నుండి హుజూర్‌ నగర్‌ వరకు అరాచకం సృష్టించారని హుజూర్‌ నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గతంలో ఇదేరకమైన దండయాత్ర చేశారని, ఇపుడు రైతులు తిరగబడ్డారని.. రేపు సామాన్యప్రజలు తిరగబడతారన్నారు. వందకార్లలో రౌడీలతో రావడం పరామర్శనా అన్నారు. సీఎం కేసీఆర్‌ను కదిలించాలనుకుంటే ప్రళయం వస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement