మాజీ మంత్రి ఈటల రాజేందర్ వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రశ్నించారు. తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల రాజేందర్ బీజేపీలో ఎలా చేరారని నిలదీశారు. బీజేపీలో చేరకముందు ఈటలకు పరాభవం ఎదురైందని, పార్టీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల ఎందుకు చేరలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకోవడం మినహా ఏం ఉద్ధరిద్దామని ఈటల బీజేపీలో చేరారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని, ఏమి ఉద్ధరించడానికి ఆపార్టీలో చేరారని కడియం సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై వాడిన భాష సరిగా లేదన్నారు. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న ఈటల ఫ్యూడల్ వ్యవస్థ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
ఐదేళ్ల క్రితమే సీఎంతో మనస్పర్థలు వస్తే ఇప్పుడు ఆత్మాభిమానం గుర్తుకు వచ్చిందా? అని అడిగారు. దాదాపు 26 లక్షల రూపాయల రైతు బంధు తీసుకున్న ఈటల.. రైతు బంధు గురించి తప్పుగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకు నల్ల చట్టాలు, టీకాల వ్యవహారంపై బీజేపీని విమర్శించిన ఈటల.. ఆ పార్టీలోనే చేరడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ ఈటలకు రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చిందని, పార్టీలో అన్ని పదవులను అనుభవించి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన విజ్ఞతకు నిదర్శమని కడియం పేర్కొన్నారు.