Friday, November 22, 2024

మహిళపై టీఆర్​ఎస్​ లీడర్​ హత్యాయత్నం.. కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటున్న నిందితుడు

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ లీడర్​పై కేసు నమోదైంది. ఓ మహిళపై దాడి చేసి, ఆమె గొంతు కోసేందుకు యత్నించాడన్న ఆరోపణతో ఈ కేసు నమోదు  చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. బాధితురాలు నిషా అనే 35 ఏళ్ల మహిళ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిందితుడు జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే పీఏ వియససింహారెడ్డిపై 448, 324, 354(ఎ) 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరీశ్ చంద్రారెడ్డి తెలిపారు.

అయితే.. నిషా మెడపై కోసిన గుర్తులున్నాయి. ఆమె నొప్పితో మెలికలు తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ కావడంతో పోలీసు దీనిపై సీరియస్​గా పరిగణిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే పీఏ విజయసింహారెడ్డి తన భార్య గొంతు కోసేందుకు ప్రయత్నించాడని బాధిత మహిళ భర్త పేర్కొన్నాడు. ‘‘సిన్హా తన భార్యకు స్నేహితుడని, రోజుకు చాలాసార్లు ఆమెకు ఫోన్ చేసేవాడని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అతను నా భార్య నెంబర్‌కు చాలాసార్లు కాల్ చేసేవాడు. వారి మధ్య కాల్ రికార్డ్ లు నేను విన్నాను. అతను న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు’’ అని నిషా భర్త చెబుతున్నాడు.

ఇదిలా ఉండగా.. ఇది కుట్ర ప్రకారం జరిగిందని, తనను కేసులో ఇరికించేందుకే ఇదంతా చేశారని అంటున్నాడు విజయసింహారెడ్డి. ఇదంతా మాజీ డిప్యూటీ మేయర్‌ కుట్రలో భాగంగా జరుగుతోందన్నాడు. తాను బోరబండ డివిజన్ టీఆర్‌ఎస్‌ పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తున్నానని, ఆరేళ్లుగా మాజీ డిప్యూటీ మేయర్‌.. ప్రస్తుత బోరబండ డివిజన్‌ ​​కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌కు పీఏగా పనిచేసినట్టు తెలిపాడు. అతడి దోపిడీ, ఇతర కార్యకలాపాలను చూసి.. అతని దగ్గర నుంచి బయటికొచ్చినట్టు తెలిపాడు. 

తన విషయాలు బయటపెడతానన్న కోపంతోనే బాబా ఫసియుద్దీన్ కుట్ర పన్నాడని, తనపై కేసు పెట్టడానికి బాధిత మహిళ, ఆమె భర్తకు రూ. 3 లక్షలు ఇచ్చాడని వారం క్రితం తన దృష్టికి వచ్చిందన్నాడు. తాను హత్యాయత్నం చేసినట్టు వస్తున్న వార్తలో నిజం లేదని, ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నాననేదానికి ఆధారాలున్నాయని తెలిపాడు. పోలీసుల దర్యాప్తులో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement