Friday, November 22, 2024

ఆప‌రేష‌న్ హుజూరాబాద్…..

ఈటలను ఒంటరి చేయడమే లక్ష్యంగా పావులు
స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలతో టీఆర్‌ఎస్‌ పెద్దల చర్చలు
అధికారుల బదిలీలు
పరిస్థితి అంచనాకు సర్వే బృందాలు
రంగంలోకి ఎమ్మెల్యే పెద్ది…
త్వరలో గంగుల టీమ్‌ పర్యటన

హైదరాబాద్‌, : ఆపరేషన్‌ హుజూరాబాద్‌ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ వేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆయన రాజీ నామా చేసి, పోటీచేస్తే ఓడించేందుకు క్షేత్రస్థాయి గ్రౌండ్‌ ను అంచనావేస్తూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండురోజుల పాటు ఈటల రాజేందర్‌ హుజూరా బాద్‌లో ఉండగా, క్షేత్రస్థాయిలో ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, క్యాడర్‌ వెళ్ళకుండా కట్టడిచేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఉద్యమనేతలను, ఆదినుండి పార్టీలో ఉన్నవారిని.. బయటకు వెళ్ళ కుండా చేసేందుకు, ఆయన వెంట వెళ్ళేదెవరు.. పార్టీ లైన్‌లోనే ఉండేదెవరు? జాగ్రత్తగా గమనిస్తోంది. అన్ని అంశాలపై పరిశీలన జరిపి.. క్షేత్రస్థాయి పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అధినేత ఎంపికచేసి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో పెద్ది రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈటల రాజేందర్‌ రాజీనామా చేస్తాడా.. పార్టీ నుండి పంపేస్తారా అన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రెండు శిబిరాలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాయి. హుజూరాబాద్‌లో స్థానిక బలాన్ని, బలగాన్ని చెదరగొట్టి ఈటలను ఒంటరి ని చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా హుజూరాబాద్‌ ఎసిపిని బదిలీచేసి.. హైదరా బాద్‌ సిఐడిలో పనిచేస్తున్న కోట్ల వెంకట్‌రెడ్డిని నియమించారు. స్థానిక అధికారులను బదిలీచేశారు. ఈటలకు సంబంధించిన భూముల విచారణకు ఇప్పటికే ఐఎఎస్‌ల కమిటీలు నియమించిన ప్రభుత్వం అష్టదిగ్భందనం చేసే వ్యూహంలో ఉన్నట్లు కనబడుతోంది. హుజూరాబాద్‌లోనూ ఆయన వెంట వెళ్ళే అవకాశమున్న ప్రజాప్రతినిధుల జాబితా తయారుచేసి.. ఒత్తిళ్ళు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నుండి గెలిచిన ప్రజాప్రతినిధులు, బలమైన నేతలు ఆయన వెంట వెళ్ళకుండా వ్యూహాలు రచిస్తోంది. ఓ వైపు అధికారుల బదిలీ, మరోవైపు స్థానిక నేతల కట్టడి చేస్తూనే.. ఈటల వెళ్ళిపోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజల మూడ్‌ ఈటలకు అనుకూలంగా ఉందా? టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందా? అన్న అంశాలపై పలు సర్వే సంస్థలతో టీఆర్‌ఎస్‌ పెద్దలు సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బుధవారం పలు సర్వే బృందాలు హుజూరాబాద్‌ రంగంలోకి దిగి క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరిస్తూ నాడిని పట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ముందు ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ వెళ్ళి.. అక్కడి ప్రజలతో చర్చించి రాజీనామా చేస్తాడని భావించగా, హైదరాబాద్‌లో ఉన్న తన సన్నిహితులు.. మేధావులు, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మరోవైపు ఈటల రాజీనా మా చేయకుంటే పార్టీ నుండి బహిష్కరించాలని కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈటల రాజీనామా చేసిన వెంటనే రంగంలోకి దిగేందుకు.. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ బృందాలు రెడీగా ఉన్నాయి. మంత్రి గంగుల కమలాకర్‌ ఇప్పటికే.. హుజూరాబాద్‌ వెళ్ళి పార్టీని కాపాడుకుంటామని ప్రకటించారు. ఇప్పటిదాకా.. నాగార్జునసాగర్‌పై రాష్ట్ర రాజకీయాల దృష్టి నిలవగా, ఆ లెక్క తేలిపోవడంతో.. ఇక హుజూరాబాద్‌ ఆసక్తికర రాజకీయాలకు వేదికగా మారింది. గులాబీదళపతి కేసీఆర్‌ చకచకా కదుపుతున్న పావులతో.. హుజూరాబాద్‌ నుండి హైదరాబాద్‌ దాకా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
పుట్టమధుపై చర్చ
ఈటల రాజేందర్‌ భూములపై విచారణకు ఆదేశించిన రోజు నుండి గత ఐదురోజులుగా పెద్దపల్లి జడ్పీఛైర్మన్‌ పుట్టమధు అందుబాటులో లేకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈటలకు అత్యంత సన్నిహితుడిగా పుట్టమధుకు పేరుంది. మధు.. ఉద్దేశపూర్వకంగా అందుబాటులో లేకుండా పోయాడా? కేసుల భయాలున్నా యా? తెరవెనుక వ్యూహమేంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement