Tuesday, November 26, 2024

సర్పంచ్‌ల అధికారాలకు టిఆర్‌ఎస్‌ సర్కార్‌ కత్తెర.. త్వరలో బీజేపీ మౌనదీక్ష..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సర్పంచ్‌లకు ఉన్న అధికారాలకు కత్తెర వేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నీరుగారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నిధుల వినియోగంలో సర్వాధికారాలను సర్పంచ్‌లకు కట్టబెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టంను తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగంలోని 73,74వ అధికరణలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలోని సర్పంచ్‌లకు బహిరంగ లేఖను బండి సంజయ్‌ రాశారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు, సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణకు త్వరలో బీజేపీ మౌన దీక్ష చేపడుతుందని ఆయన వెల్లడించారు. దీక్షకు సర్పంచ్‌లు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. గ్రామాలు స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యమని ఆయన తెలిపారు.

పంచాయతీలకు కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. సర్పంచ్‌ల పట్ల అధికారుల వేధింపులు ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 2014 నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్‌ వ్యవస్థ అనే అంశాల కింద ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన మండిపడ్డారు. నిధులు మంజారు చేసినట్లుగా జీవోలు జారీ చేసి ప్రభుత్వ అకౌంట్లను ఫ్రీజ్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నించిన సర్పంచ్‌లను చెక్‌పవర్‌ రద్దు చేస్తామని బెదిరిస్తోందని చెప్పారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన కోరారు. మీకు బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తల్లెత్తుకునేలా చేసే బాధ్యత తమదేని ఆయన స్పష్టం చేశారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, గ్రామ స్వరాజ్యం సాదిద్ధాం, రామ రాజ్యాన్ని నిర్మించుకుందామని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement