Tuesday, November 26, 2024

కెసిఆర్ ఎత్తిన గులాబీ జండా – ఆత్మ‌గౌర‌వం గుండె నిండా…

నేడు టీఆర్‌ఎస్‌ 20వ వార్షికోత్సవం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌త్యేక క‌థ‌నం…

రాష్ట్రసాధన.. స్వపరిపాలన
టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో అనేక మైలురాళ్ళు
నిరాడంబరంగా ఊరూరా జెండా ఆవిష్కరణలు
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీరామారావు పిలుపు

తెలంగాణ ప్రజల జీవన రేఖ తెరాస
దేశ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం. చాలా సాదా సీదాగా ప్రారంభమయిన టీఆర్‌ఎస్‌ 20 ఏండ్లలో ఇన్ని సంచలనాలు సృష్టిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఎవరి అంచనాలకు అందకుండా ఉద్యమాన్ని నడిపి రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాన్ని చేరుకున్న కేసీఆర్‌ నాయకత్వ లక్షణం అద్భుతం. దుర్బేద్యమైనది అనుకున్న సమైక్య పాలనను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన తీరు అనితర సాధ్యమైనది. నిరాశ నిట్టూర్పుల నుండి తెలంగాణ స్వాప్నికుల భయ సందేహాలను పారదోలి భిన్న దృవాలైన కుడి, ఎడమ మద్యేవాద ఆలోచనలను, ఆలోచనా పరులను ఏకం చేసి ఉద్యమ లక్ష్యాన్ని తీరం దాటించిన అద్భుతమైన నావికుడు కేసీఆర్‌. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు నిత్యకృత్యాలైనా పడి లేచిన కెరటం లాగా అన్ని ఆటుపోట్లను తట్టుకొని చివరికి నిరాహారదీక్షతో ప్రాణాన్ని ఫణంగా పెట్టి చావు అంచుల్లోకి వెళ్లి తెలంగాణా ఫలాన్ని తెచ్చిన వీరుడు కేసీఆర్‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్నామని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించి, తెలంగాణను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకువెళుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ గులాబీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దాం… మన ఆత్మగౌరవాన్ని మరోమారు చాటుదామని ఆయన అన్నారు. ఇక తెలంగాణభవన్‌లో పార్టీ సెక్రటరీ జనరల్‌ కేకేశవరావు మంగళవారం పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రసమితి ద్విదశాబ్ది వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని భావించింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ తుఫాన్‌లా వచ్చి పడడంతో వేడుకలు రద్దు చేసుకుంది. 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ ఎత్తిన గులాబీ జెండా దేశ రాజకీయాల్లో సంచలనమై.. లక్ష్యసాధనలో తిరుగులేని ఠీవీగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్‌ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సమితిది ప్రత్యేక చరిత్ర. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన కేసీఆర్‌.. డిప్యూటి స్పీకర్‌ పదవికి 2001, ఏప్రిల్‌ 21న రాజీనామా చేశారు. వారం రోజుల్లోనే పార్టీ ప్రకటించారు.
పదవీ త్యాగపునాది మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుం దని నమ్మిన కేసీఆర్‌.. అదే విజన్‌తో 14 ఏళ్లపాటు ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 2001, మే 17న తెలంగాణ ‘సింహగర్జన’ భారీ బహిరంగ సభలోనే కేసీఆర్‌ రాజకీయ పోరాటం ద్వారానే తెలం గాణ సాధిస్తామని ప్రకటించారు. ఇక నాటి నుంచి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు మొద లయ్యాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు, నాటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో కరీంనగర్‌లో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రక టింపజేయడం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలం గాణ అంశాన్ని చేర్చ డం కీలక మైలురాళ్ళు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరిన తర్వాత దేశం లోని 35 పార్టీల అభిప్రా యాలను తెలంగాణకు అనుకూలంగా తీసుకురావడం లాంటివన్నీ తెలంగాణ సాధనకు మార్గం సుగమం చేసిన ఎత్తుగడలుగా విశ్లేషకులు అభివర్ణిస్తారు.

- Advertisement -

కేసీఆర్‌ దీక్ష టర్నింగ్‌ పాయింట్‌
‘కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ 2009, నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరా హారదీక్ష చేపట్టగా, ఉద్యమ చరిత్రలో ఇది టర్నింగ్‌ పాయింట్‌. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చింది. 2009, డిసెంబర్‌ 9న నాటి హోం మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అనేక రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలతో తెలంగాణ బిల్లును ఆమో దింపజేసుకోగా, సాధించిన రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వానికే ప్రజలు జైకొట్టారు. టీఆర్‌ఎస్‌ను అపూర్వంగా ఆదరించారు. 2014 జూన్‌ 2న అపాయింట్‌డే నుండి ఇప్పటిదాకా.. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వరుసగా రెండు టర్మ్‌లు ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించగా, పంచాయతీ నుండి పార్లమెంట్‌ దాకా.. అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపే జనం మొగ్గుచూపుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం.. పిడికెడు మందితో కేసీఆర్‌ ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ ఇపుడు 65లక్షల గులాబీ సైన్యంతో దుర్బేధ్యంగా ఉంది. కేసీఆర్‌ నాయకత్వపటిమ, వ్యూహాలు, ఎత్తుగడలు.. టీఆర్‌ఎస్‌ను శిఖరస్థాయికి చేర్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement