Monday, November 18, 2024

హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వేడి.. కాంగ్రెస్ లైట్ తీసుకుందా?

హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ వేడి పెంచుతోంది. టీఆర్ఎస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం హాయిగా దుప్పటి కప్పుకుని ఇంట్లో కూర్చుంది. హుజురాబాద్‌కు రేపో మాపో నోటిఫికేషన్ రానుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సైలెంట్‌గా ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హుజురాబాద్ లో గెలుపు కోసం ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ పార్టీలు పక్కా వ్యూహాలతో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన నాయకులు వరుస పర్యటనలతో దూసుకుపోతున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉలకు పలుకు లేకుండా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వ‌రుస ఓట‌ముల‌తో వైరాగ్యం క‌లిగిందో లేక‌.. ఎలాగూ గెల‌వ‌లేమ‌ని ఫిక్స్ అయ్యారో ఏమో ఒక్క‌రంటే ఒక్క‌రు హుజురాబాద్ వైపే చూడ‌డం లేదు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. దీంతో పార్టీ నాయకులు నిరాశలో ఉన్నారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా రేవంత్, కొమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రచారాన్ని ముందే మొదలు పెడతారు. గతంలో దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నోటిఫికేషన్ కంటే ముందే ప్రచారంలో చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తీవ్రంగా శ్రమించారు. అయితే హుజురాబాద్‌కు వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులెత్తేశారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ప్ర‌స్తుత కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ వంటి నేతలు కూడా కనీసం హుజురాబాద్ వైపు చూడ‌క‌పోవ‌డం.. కాంగ్రెస్ శ్రేణుల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తోంది.

నిజానికి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఈటలకు కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరడంతో కాషాయ పార్టీ బలపడింది. ఉప ఎన్నిక రాబోతోంద‌న్న స్పృహే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో క‌నిపించ‌డం లేదు. టీఆర్ఎస్, బీజేపీ ఇప్ప‌టికే మండ‌లాల వారీగా ఇంచార్జీల‌ను కూడా మొహ‌రిస్తే… కాంగ్రెస్ మాత్రం తాత్సారం చేస్తోంది.

మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్‌ను పార్టీ హైకమాండ్ ఇప్పటి వరకు ఇంకా ఎంపిక చేయలేదు. రేవంత్ రెడ్డిని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నా… ఆయన పేరును మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కొత్త సార‌థి పేరును ప్ర‌క‌టించ‌కుండా ఇంకా నాన్చుతుండ‌టంతో.. ఎవ‌రు ముందడుగు వేయాల‌న్న‌ది తేల్చుకోలేక‌పోతున్నారు. ఎలాగు అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దిగిపోతున్నాన‌ని ఉత్త‌మ్ లైట్ తీసుకుంటున్న‌ట్టు క‌న‌బ‌డితే.. ఎవ‌రి పేరు ప్ర‌క‌టిస్తారో తెలియ‌ద‌న్న డైలామాతో మిగిలిన వారూ ముందడుగు వేయ‌డం లేదు. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసిన తర్వాతే హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగాలని ఆపార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఉప ఎన్నిక‌లో ఈటలపై కాంగ్రెస్ త‌ర‌పున‌ ఎవరు పోటీ చేస్తారు? అన్నది కూడా సస్పెన్స్ గా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్‌ రెడ్డి ఇటీవ‌ల మంత్రి కేటీఆర్‌తో భేటీ కావడంతో ఆయ‌న పోటీపై అనుమానాలు నెల‌కొన్నాయి. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్లేది లేద‌ని ఎంత వివ‌ర‌ణ ఇచ్చినా.. ఏక్ష‌ణ‌మైనా ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకుంటారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నికల చావో రేవో అన్నట్లు మారింది.

- Advertisement -

ఇది కూడా చదవండి: రాయలసీమ ఎత్తిపోతల పై కెసిఆర్ కు షెకావత్ ఫోన్

Advertisement

తాజా వార్తలు

Advertisement