న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారాయని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల తొలిరోజు లోక్‌సభ వాయిదాపడ్డ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో పంట కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ అంతిమంగా రైతులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి (రబీ)లో రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ జాప్యం.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం లోక్‌సభలో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు దేశంలో రెండు గిరిజన విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయని, అందులో ఒకటి ‘సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ కాగా, మరొకటి మధ్యప్రదేశ్‌లోని ‘ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ’ అని కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం, తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ స్థాపన ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీతో కలిపి ఏకకాలంలో ప్రారంభించామని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని అందించడంలో ఆలస్యం చేసిందని, ఈ కారణంతో ఏపీ గిరిజన విశ్వవిద్యాలయ పనులతో తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ పనులను అనుసంధానించకుండా వేరుచేశామన్నారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఏర్పాటు కోసం భూపాలపల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని ఎంపిక చేసిందని తెలిపారు. కాగా ప్రస్తుతం డీపీఆర్ సిద్ధం చేసి, మంత్రుల మధ్య సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, ఆర్థిక ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను సంబంధిత శాఖకు పంపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నలకు ఉమ్మడిగా ఆయన బదులిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్పేజీలను ఫాలో అవ్వండి..