Wednesday, September 18, 2024

Sitaram Yechury – అలుపెర‌గ‌ని పోరాట‌ యోథుడికి లాల్ స‌లామ్ ….

న్యూ ఢిల్లీ – సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆగస్టు 19న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. తొలుత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. పరిస్థితి సీరియస్ గా మారడంతో వెంటిలెటర్ పై చికిత్స అందించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ఆయ‌న తుది శ్వాస విడిచారు…

ప్ర‌స్థానం ..

సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12న చెన్నైలోని ఓ తెలుగు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. సీతారం విద్యాభ్యాసం అంతా కూడా ఢిల్లీలోనే సాగింది. సీబీఎస్‌ఈ పరీక్షలో ఆయన జాతీయ స్థాయిలో మొదటిర్యాంకు సాధించారు. ఆ తర్వాత సెయింట్‌ స్టీఫెన్ కళాశాల నుంచి ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. 1974లో సీతారం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరారు. ఆ తర్వాత 1975 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారారు.

- Advertisement -

1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఆయ‌న అరెస్టయ్యారు. ఆ సమయంలో జేఎన్‌టీయూలో పీహెచ్‌డీలో చేస్తున్న ఆయన డాక్టరేట్‌ పూర్తి చేయలేకపోయారు. దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత సీతారాం జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు.

1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. ఇక 2005లో పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంటు దృష్టికి ఎన్నో సమస్యలను తీసుకుచ్చి మంచి గుర్తింపును పొందారు. 2006లో బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు. 2011లో తిరిగి రాజ్యసభకు తిరిగి ఎన్నిక‌య్యారు. 2012లో వ్యవసాయ క‌మిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. 2015, ఏప్రిల్ 19న విశాఖపట్నంలో జరిగిన సీపీఐ(ఎం) 21వ కాంగ్రెస్‌లో పార్టీకి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్నికయ్యారు. అలాగే ఆ ఏడాది బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది.

భారత్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా బరాక్‌ ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని వ్యతిరేకించారు. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణమని ఏచూరి విమర్శించేవారు. ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఆరోపిస్తుండేవారు. అలాగే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను కూడా ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ దేశంలో మత విద్వేషాన్ని పెంచుతోందని విమర్శలు చేసేవారు. అలాగే జమ్మూ, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు. కాగా, సీతారం మొదటి భార్య ఇంద్రాని మజుంబార్. ఆ తర్వాత బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్‌ అయిన సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా రెసిడెంట్ ఎడిటర్‌గా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement