మూగబోయిన గోండు పల్లెలు
మార్లవాయిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సంతాపం
ఆదివాసీ సంస్కృతి, నృత్య కళలకు జీవం పోసిన రాజు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ఆదివాసీ రాజ్ గోండుల ప్రాచీన కళలు, గుస్సాడి నృత్య సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిన పద్మశ్రీ కనకరాజు ఇక లేరు అన్న వార్తతో గిరిజన గూడెంలు మూగబోయాయి. ఆదివాసులకు పెద్దదిక్కుగా, అరుదైన గుస్సాడి నృత్య కళతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టిన కనకరాజు అకాల మరణంతో గిరిజనులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా జైనూరు మండలం మార్లవాయి గిరిజన గూడెంలో అస్తమా వ్యాధితో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం కనకరాజు (70) మృతి చెందగా పెద్ద సంఖ్యలో గిరిజనులు చేరుకొని నివాళులర్పించారు. 1980 లో అప్పటి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో రిపబ్లిక్ డే వేడుకల్లో ఇచ్చిన కనకరాజు గుస్సాడీ నృత్య ప్రదర్శన ప్రశంసల వర్షం కురిపించింది. 2021 నవంబర్‌లో భారత ప్రభుత్వం ఆదివాసి సాధారణ బిడ్డకు పద్మశ్రీ అరుదైన అవార్డుతో సత్కరించింది. తాను పుట్టిన మార్లవాయి గ్రామంలోనే నేటి తరం యువకులకు గుస్సాడీ నృత్యంపై శిక్షణ కల్పించేలా ప్రత్యేకంగా కోటి రూపాయలను మంజూరు చేసింది. ఈ శిక్షణ కేంద్రం ద్వారానే గుస్సాడీ నృత్య గురువుగా ఎందరో మంది కళాకారులను రాజు తీర్చిదిద్దారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు భౌతికకాయాన్ని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు శనివారం సందర్శించి నివాళులర్పించారు. పెద్ద దిక్కును కోల్పోయామని గిరిజనులు కంటతడి పెట్టారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో, ఆదివాసి సంస్కృతి ఆచారాల కనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పుష్పగుచ్ఛంతో నివాళులర్పించి కడసారి వీడ్కోలు పలికారు.
కనకరాజు భావితరాలకు దిక్సూచి : ప్రధాని మోదీ
‘‘గుస్సాడి రాజుగా పేరుగాంచి, అంతరించిపోతున్న సంప్రదాయ నృత్య కళలకు జీవం పోసిన రాజు అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం. రాజు భౌతికంగా లేకపోయినా భావితరాలకు దిక్సూచిలా గుస్సాడీ కి పూర్వ వైభవం తీసుకురావాలి” అని ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ కనకరాజు కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కనకరాజు మృతి గిరిజనులకు తీరనిలోటని వారు పేర్కొన్నారు. కనకరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.