Wednesday, November 20, 2024

ADB: ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చి.. ఓట్లేసిన గిరిజనులు

జైనూర్, నవంబర్ 30 (ప్రభన్యూస్) : కొమరం భీం జిల్లా జైనుర్ మండలంలోని దబోలి పంచాయతీలో గల అటవీ ప్రాంతంలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలైన లొద్దిగూడ గ్రామాల ప్రజలు ప్రతిసారి జరిగే ఎన్నికల పోలింగ్ రోజున ఓట్లు వేయడానికి దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు కాలినడకన వచ్చి ఇబ్బందులు పడుతూ ఓట్లు వేస్తున్నారు. ఇవాళ‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రానికి లొద్దిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసి ఓటర్లు కాలినడకన వచ్చి ఓటు హక్కువినియోగించుకున్నారు.


ఎన్ని ప్రభుత్వాలు మారినా లొద్దిగూడ గోండు, కోలం గూడలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామాల ఆదివాసి ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆశీర్వాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కృషితో షేకు కూడా నుండి లొద్దిగూడ ఘాట్ ప్రాంతం వరకు మట్టి రోడ్డు ఎత్తు ప్రాంతాలను వెడల్పు పనులు చేయించి కనీసం నడవడానికి సౌకర్యం కలిగిందని, వాహనాలు వెళ్లడం సాధ్యం కాదని వారు తెలిపారు. తమ గ్రామాలకు అధికారులు పనుల నిమిత్తం రావాలన్నా కాలి నడకన ఇబ్బందులు పడుతూ వస్తారని తెలిపారు. ఇప్పటికైనా కొత్తగా ఏర్పడే ప్రభుత్వ హయాంలోనైనా రోడ్డు సౌకర్యం కల్పించాలని తమ ఇబ్బందులను తొలగించాలని ఆదివాసి ఓటర్లు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement