Friday, October 25, 2024

TG | గిరిజ‌న ప్రాంతాల‌కు అభివృద్ధి ఫ‌లాలు అందాలి… గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌

  • కొత్తగూడెంలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలతో స‌మావేశం
  • మ‌హిళా సాధికార‌త‌తో భ‌విష్య‌త్తు
  • కొండ రెడ్ల గిరిజ‌నుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలని సూచ‌న‌


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, కొత్త‌గూడెం : అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేద గిరిజనులకు అందేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కోరారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖీలో పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు.

అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌శంస‌…
అనంతరం రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమన్నారు. గిరిజన కుటుంబాల్లో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 481 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, గిరిజన కుటుంబాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రచయితలు, కళాకారులను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేసిన గిరిజన వంటకాలు చాలా బాగున్నాయని తెలిపారు.

మ‌హిళా సాధికార‌త‌పై భ‌విష్య‌త్తు…
భవిష్యత్తు మహిళా సాధికారతపై ఆధారపడి ఉందని, ఈ విషయం తాను కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా గుర్తించానని గ‌వ‌ర్న‌ర్‌ చెప్పారు. స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని విజయాలు సాధించిన మహిళల గురించి సమాజానికి తెలియజేయాలని కోరారు. మహిళల చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు ఆర్థిక సాధికారత వస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితుల మెరుగు కోసం కృషి చేయడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయన్నారు. 2024లో పదో తరగతిలో గిరిజన విద్యార్థులు 92 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. 2047 నాటికి ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాచలం, పర్ణశాలలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేసుకొని ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చన్నారు.

- Advertisement -

కొండ రెడ్ల గిరిజ‌నుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌…
గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న కొండ రెడ్ల గిరిజనుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ‌వ‌ర్న‌ర్ సూచించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను సక్రమంగా నడిచే విధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు సరఫరా కావాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కవులు, రచయితలు శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేష్ శ్యామ్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, జిల్లా అధికారులు ఐటీడీఏ అధికారులు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు వచ్చిన గవర్నర్ కు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్, కొత్తగూడెం, భద్రాచలం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, వివిధ శాఖల అధికారులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement