Friday, November 22, 2024

TS: పోలింగ్ రోజున విషాదం.. ఐదుగురు మృతి

విధుల‌లో ఉండ‌గా ఇద్ద‌రు
ఓటు వేసేందుకు వ‌చ్చి ముగ్గురు మృతి
మ‌రోక ఉద్యోగికి పాము కాటు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అక్కడక్కడ పలు విషాద ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఓటు వేయడానికెళ్లిన ముగ్గురు, విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు అస్వస్థతకు గురై, గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన ఆయా స్థానిక ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

వివరాళ్లోకెళ్తే.. ఖమ్మం నగరానికి చెందిన పోలూరి శ్రీకృష్ణ (50) భద్రాద్రి కొత్తగూడెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎన్నికల విధుల్లో భాగంగా అశ్వారావుపేట మండలం పేరాయగూడెం పంచాయతీ నెహ్రూనగర్‌ పాఠశాల (పోలింగ్‌ బూత్‌ నం.165)లో అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌(ఏపీవో)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 9.45 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావటంతో సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.

- Advertisement -

అశ్వారావుపేట మండల పరిధి వేదాంతపురం గ్రామానికి చెందిన కాళీ నాగేశ్వరరావు (58) ఓటు వేయడానికి వచ్చి ఒక్కసారిగా అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతిచెందాడు.

నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మహ్మద్‌ సాదిక్‌ (35) తన తల్లి మహమూదా అలీ (వీఆర్‌ఏ) ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె స్థానంలో డిచ్‌పల్లి సీఎంసీలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గుండెపోటు రావటంతో వెంటనే ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. సాదిక్‌కు ఎన్నికల విధులు కేటాయించలేదని, సీఎంసీకి వచ్చి మృతిచెందటం బాధాకరమని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ఇప్పకాయల సరోజని (75) అనే మహిళ పెద్దమ్మగడ్డ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసి, బయటకొచ్చి కుప్పకూలిపోయింది. స్థానిక దవాఖాన వైద్యులు పరీక్షించి, గుండెపోటుతో మృతిచెందినట్టు ధ్రువీకరించారు.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన దొంతు వీరమ్మ (55) స్థానికంగా ఓటు హక్కు వినియోగించుకొని ఇంటి దగ్గరికి రాగానే కింది పడి గుండెపోటుతో మృతిచెందింది.

ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలంలో అందర్‌బంద్‌లోని పోలింగ్‌ బూత్‌లో విధులుకు వచ్చిన ఉపాధ్యాయుడు విపుల్‌రెడ్డిని పాము కాటు వేసింది. వెంటనే రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతున్నాడు. అత‌నికి ప్రాణాపాయం లేద‌ని వైద్యులు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement