పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తూ పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 17 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయమూర్తి మంజుల 17 మందికి రూ.20,400 జరిమానా విధించారు.
అయితే అత్యధికంగా మద్యం సేవించి వాహనం నడిపిన సుల్తానాబాద్ మండలం మంచిరానికి చెందిన ఆవుల రమేష్ కు రూ.1000 జరిమానాతో పాటు సామాజిక సేవలో భాగంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పునిచ్చారు.
శని, ఆదివారాల్లో రమేష్ ట్రాఫిక్ విధుల్లో ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. న్యాయమూర్తి తీర్పు ప్రకారం రమేష్ తో రెండు రోజుల పాటు ట్రాఫిక్ విధులు చేయిస్తామిని పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తెలియజేశారు.