హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్ సమస్యతో ఉద్యోగులు, వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, సైబర్ టవర్స్ మీదుగా జేఎన్‌టీయూ వైపు ప్రతిరోజూ రద్దీ ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ క్రమంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఐకియా షాపింగ్ మాల్ వద్ద రోడ్డును వెడల్పు చేశారు.
ఇక నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా జంక్షన్ మీదుగా సైబర్ టవర్స్ వైపు వెళ్లే వాహనదారులు ఐకియా అండర్ పాస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా జంక్షన్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులు ఐకియా రోటరీ వద్ద రైట్ టర్న్ తీసుకుని యాంటీ క్లాక్‌వైజ్ డైరెక్షన్‌లో కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలి. ఇక ఇదే రూట్లో కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాలనుకునే వాహనదారులు ఐకియా రోటరీ వద్ద యూటర్న్ తీసుకుని ఐకియా ఫ్లైఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు ఐకియా అండర్ పాస్ నుంచి బయోడైవర్సిటీ వైపు వెళ్లాలి. మీనాక్షి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ వైపు వెళ్లే వాహనాలు ఐకియా రోటరీ వద్దకు చేరుకుని సీ గేట్ వద్ద యూటర్న్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్‌లలో ప్రయాణించే వాహనదారులు, ఉద్యోగులు పోలీసులకు సహకరించాల్సిందిగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కోరారు. ఈ నెల 22 వరకు ఈ డైవర్షన్స్ అమలులో ఉంటాయని వెల్లడించారు.