హైదరాబాద్ (ప్రభన్యూస్): ధాన్యం విక్రయించుకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. ఎప్పుడూ లేని విధంగా కోత నుంచి అమ్మకం వరకూ టోకెన్ల సిస్టంను తీసుకురావడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పండిన పుట్టెడు వడ్లలోనూ వ్యాపారులు తరుగు తీస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కర్షకులపై వరుణుడు పగబట్టాడా అన్న విధంగా వానలు కురుస్తుండడంతో ఏం చేయాలో తెలియక రైతు అయోమయంలో ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో పలు చోట్ల తడిసిన ధాన్యం మొలక రావడం గమనార్హం. మొలక వచ్చిన ధాన్యాన్ని ఎవరు కొంటారంటూ రైతులు లబోదిబోమంటున్నారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించిన రైతులకు కడుపుకోతే మిగులుతోంది. కోత కోసుకుని ఆరబెట్టుకుని తీసుకెళ్లినా, వెంటనే మిల్లులకు తీసుకెళ్లినా మిల్లర్లు ధాన్యంలో తేమ, తాలు ఉందంటూ కోతలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక ట్రాక్టర్లోడ్ మిల్లులోకి వెళ్లిన తరువాత అందులో పుట్టెడు వడ్లు ఉన్నా.. 100 బస్తాల వడ్లు ఉన్నా.. కోతలు మాత్రం ఒకే విధంగా ఉంటున్నాయని, దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు.
వాస్తవానికి ధాన్యంలో తేమ చెత్త, తాలు , మట్టిపెడ్డలు, రాళ్లు, రంగుమారిన, చెడిపోయిన, మొలకెత్తి, పురుగుతిన్న ధాన్యం ఉన్నా ఎలాంటి కోతలు లేకుండా తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ ప్రకటనలు ఇస్తోంది. కానీ వాటినేమాత్రం పట్టించుకోకుండా, వీటిలోని శాతాలను చూడకుండానే మిల్లర్లు, వ్యాపారులు ధాన్యంలో కోతలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరిట తరుగుతో అక్కడ సరైన ధర రావడంలేదని రైతులు అంటున్నారు. మొత్తానికి వ్యాపారులు అదును చూసి కోత విధిస్తున్నారని అన్నదాతలు చెబుతున్నారు. అయితే మిల్లర్లు మాత్రం రైతులు ట్రాక్టర్లలో తీసుకువస్తున్న ధాన్యానికి ఇచ్చిన వే బిల్లుల్లో, నగదు ఇచ్చేటపుడు వేబిల్లో 30కేజీల తరుగు రాస్తున్నారని రైతులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల వద్ద ఏర్పడుతున్న పరిస్థితులన్నీ ప్రతి ఏడాదీ ఉత్పన్నమయ్యే సమస్యలే అయినప్పటకీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రస్తుతం రైతులు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని రైతు సంఘాలు అంటున్నాయి. దీంతోపాటు గన్నీ సంచుల విషయంలోనూ ప్రతి ఏటా కొత్తవి, పాతవాటిని కొనుగోళ్లకు ముందే అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నా కొనుగోళ్ల సమయానికే టెండర్లను ఆహ్వానించడం, ధరల్లో వత్యాసాలతో ఇబ్బందులు ఏర్పడడంతో గన్నీ సంచుల అందుబాటులోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily