మక్తల్, ఏప్రిల్24 (ప్రభ న్యూస్) : మక్తల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ నర్వ మండల పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డికి డీకే అరుణ పార్టీ కండువా కప్పి సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన మద్దతుదారులు కూడా బీజేపీలో చేరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపే లక్ష్యంగా పనిచేస్తారని ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం విశేషంగా కృషిచేసిన లక్ష్మి కాంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఊట్కూరు మండల ఇన్చార్జిగా నియమించడంతో మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థికి మద్దతు కూడా గట్టడంలో విశేషంగా పనిచేశారు. అయితే బీజేపీ నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.