Friday, October 18, 2024

NZB: ఆర్ఓబి లపై టీపీసీసీ చీఫ్ మాట్లాడటం హాస్యాస్పదం… ఎంపీ అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : ఆర్ఓబి నిర్మాణ పనులకై రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయక పోవడంతోనే జాప్యం జరుగుతుందని, అవగాహన లేకుండా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎంపీ ధర్మ పురి అరవింద్ అన్నారు. 543 పార్లమెంట్లలో అన్నింటి కంటే నిజామాబాద్ పార్లమెంట్ కు ఎక్కువ ఆర్ఓబి లు మంజూరయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడో డిపాజిట్ చేసిందని, కేంద్రం ఎక్కడా నిధులు పెండింగ్ లో పెట్ట లేదన్నారు.

మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ…. నా పుణ్యాన కాంగ్రెస్ ఇక్కడ వీక్ అయిందన్నారు. ఏడు ఆర్ఓబిలలో ఒకటి పూర్తయ్యింద‌న్నారు. రూ.93 కోట్లతో మాధవనగర్ ఆర్ఓబి పనులు ప్రారంభమైతే ఇప్పుడు రూ.120 కోట్లకు చేరిందని గుర్తు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ వాటాను తొందరగా మంజూరు చేయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇవ్వక‌పోవ‌డంతోనే ఆర్ఓబి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని మండిపడ్డారు. బీఅర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థను భ్రష్టు పట్టించి పోయిందన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఒక్క ఎన్నికలో కూడా గెలిచిన వ్యక్తి కాదు.. ఆయనకు సిస్టం తెలియదన్నారు. కౌన్సిలర్ గా కూడా గెలవలేని మహేష్ కుమార్ గౌడ్..త‌మపై మాట్లాడడం ఏమిటని ఎద్దేవా చేశారు.

అడవి మామిడిపల్లి నిర్మాణ పనులకు కేంద్ర నిధులు ఎప్పుడో వచ్చాయని ఇప్ప టివరకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వలేదని ధర్మపురి అరవింద్ తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించి సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతోనే ఆర్ఓ బి నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. అడవి మామిడిపల్లి ఆర్ఓబి నిర్మాణ పనులకు సంబంధించి ఒక నెల రోజులు పూర్తి సమయాన్ని కేటాయించి ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తే నిర్మా ణ పనులు పూర్తి చేస్తానని సదరు కాంట్రాక్టర్ చెప్పినట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తో చర్చిస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement