కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ… అక్కడ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను సందర్శించాలని నిర్ణయించింది. ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.
కోకాపేట్ భూముల అమ్మకంలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని టీ.పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేలం వేసిన భూముల వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆ భూములను పరిశీలించడానికి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ రెడ్డి తదితర నేతలు.. కోకాపేటకు వెళ్లనున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు జూబ్లీహిల్స్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్‌ను గృహనిర్బంధం చేశారు. ఆయన కోకాపేట వెళ్లకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.