Monday, November 25, 2024

TPCC Chief: దండుపాళ్యం ముఠాగా బీఆర్ఎస్ నేతలు.. రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ సమక్షంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు వీరిదే క్రియాశీలక పాత్ర అని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను చీల్చాలని బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నించాయని చెప్పారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారని తెలిపారు. ఆ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి బీజేపీని బండకేసి కొట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీకి, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పెద్ద తేడా ఏం లేదని తెలిపారు. కర్ణాటకలో బీజేపీది 40 శాతం కమీషన్ సర్కార్ అయితే, తెలంగాణలో ఉన్నది 30 శాతం కమీషన్ సర్కార్ అని అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి మాట్లాడేందుకు తనకే సిగ్గనిపిస్తుందని చెప్పారు. ఇక ఆయనను పక్కన కూర్చోబెట్టుకోవడానికి సీఎం కేసీఆర్ కు ఏమీ అనిపించడం లేదా ? అని విమర్శించారు. వేధింపుల విషయంలో దేశమంతా దుర్గం చిన్నయ్య పేరు తెలుసని, కేసీఆర్ కు మాత్రం ఈ విషయం తెలియడంలేదా అని నిలదీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement