మహబూబ్ నగర్, సెప్టెంబర్ 24 (ప్రభ న్యూస్): నేటి నుంచి ఈనెల 27వ తేదీ వరకు 3 రోజులపాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ మేరకు ఆయన ఐటి టవర్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు.ఈ నెల 25న ప్రఖ్యాత గాయకురాలు శ్రావణ భార్గవి టీమ్, డిల్లు బ్రదర్స్ డాన్స్ ఉంటాయని తెలిపారు. ఈనెల 26న కృష్ణ చైతన్య టీం, మాస్టర్ గోవింద్ డాన్స్ కార్యక్రమం ఉంటుందని, ఈనెల 27న జానపద, నృత్య కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.
ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాలను పట్టణంలోని ప్రజలతోపాటు, జిల్లాలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని, పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను అభివృద్ధి, పునరుద్ధరించడం అలాగే పర్యాటక ప్రాంతాలకు ఒక కొత్త రూపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర రాజధాని సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యాటక దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతోందని తెలిపారు. దేశంలో పర్యాటకానికి తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా నిలిపామన్నారు. కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ లో జంగిల్ సాఫారిని పర్యాటకంగా ఊహించని విధంగా తీర్చిదిద్దుతామన్నారు.