హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచంలో ఇంజనీరింగ్ అద్భుతంగా భాసిల్లుతున్న కాళేశ్వరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలకు పర్యాటక నగిషీలు దిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధంచేసింది. ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణాదికి విస్తరించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదట రూ. 750 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన అంచనావ్యయాలతో రూ. 881కోట్ల 77 లక్షలతో డీపీఆర్ సిద్ధం చేస్తోంది. కళేశ్వరం నిర్మాణానికి ఆర్ధిక సహాయం అందించని కేంద్రప్రభుత్వం టూరిజం అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందించాలని ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖకు నివేదికలను సమర్పించింది.
అయితే కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రం నిధుల్లోంచి రూ. 881 కోట్ల 77 లక్షలతో కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరుతో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం చుట్టూ సుమారు 15 ఎకరాల్లో అడవిని అభివృద్ధి చేయడంతో పాటుగా ఈ ఆలయ సమీపంలో విశాలంగా ప్రవహిస్తున్న గోదావరి నదిపై పడవ ప్రయాణం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడంతో పాటుగా సర్వే పనులుపూర్తి చేసింది. అలాగే రామప్ప ఆలయం, రామప్ప టెంపుల్ పరిసరాలను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చెరువులో బోర్ట్స్ తో పాటుగా బడ్జెట్ హోటల్ నిర్మాణాలను చేపట్టనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్టు లో క్యూయిజ్ బోట్లు నడపాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.
గోదావరి, ప్రాణహిత, అంతర్వానిగా సరస్వతీ నది సంగమించే ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి చస్తే తెలంగాణ పర్యాటకులతో పాటుగా సరిహద్దులోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి అత్యధికంగా పర్యాటకులు వచ్చే అవకాశాలున్నాయని టూరిజం శాఖ అంచనావేస్తోంది. లక్ష్మీ బ్యారేజ్ నుంచి 22 కిలోమీటర్ల మేర వాటర్ స్పోర్ట్స్ తోపాటుగా గ్లైడింగ్ ఏర్పాటు చేయడంతో పాటుగా కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ప్రవాహ కాలువల్లో బోటింగ్ ఏర్పాటు, పరివాహక ప్రాంతాల్లో గ్రీనరీ పెంచేందుకు పక్కా ప్రణాళికను పర్యాటక శాఖరూపొందించింది. పర్యాటకులు రాత్రి బస చేసేందుకు కళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో బడ్జెట్ హోటళ్లు, విశ్రాంతి గృహాల నిర్మాణాలకు ప్రణాళికలను పర్యటక శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రాణహిత తెలంగాణ లో ప్రవేశించే ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని పర్యాటకులతో పాటుగా మహారాష్ట్ర సిరోంచ నుంచి అత్యధికంగా పర్యాటకులు వచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల వాటర్ క్రీడలపై విదేశాల్లో అధ్యయనం చేసిన ప్రతినిధి బృందం అంతర్జాతీయ ప్రమాణాలతో వాటర్ స్పోర్ట్స్ కు నివేదికలను రూపొందిస్తోంది. కాళేశ్వరం అనుసంధానంగా 22 పంపుహౌజ్ లు, 17 రిజర్వార్ల్లు, 3 బ్యారేజ్ ల ప్రాంతాల్లో పడవ ప్రయాణానికి అనుకూలతలు ఉన్నట్లు పర్యాటక శాఖ సమగ్ర అభివృద్ధి నివేదికను రూపొందించింది. అలాగే మిడ్ మానేరు, రంగనాయక సాగర్, కోమటి చెరువు, మల్లన్న సాగర్ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత స్థాయి అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన కాళేశ్వరం పర్యాటకరంగాభివృద్ధి లోనూ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రభుత్వం తీర్చి దిద్దేందుకు సిద్ధం కావడంతో పర్యాటక శాఖ పూర్తి స్థాయిలో కాళేశ్వరం పై దృష్టి సారించింది.
ప్రపంచ పర్యాటకులకు కాళేశ్వరం వేదిక: పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళెెశ్వరం నిర్మించి చరిత్ర సృష్టించారని పర్యాటక అభివద్ధి శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ చెప్పారు. అంతర్జాతీయ పర్యాటకులు అత్యధికంగా కాళేశ్వరం చూసేందుకు వస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు డీపీఆర్ సిద్ధం అవుతోందని చెప్పారు. ప్రధానంగా కాళేశ్వరం తీర ప్రాంతాల్లోని ఆలయాలు, చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధితో పాటుగా జలాశయాల పరిసరాల్లో గ్రీనరీ పెంపుదల చేయనున్నట్లు చెప్పారు.
జలాశయాల్లో పడవప్రయాణాలు, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధతో నివేదికలను రూపొందిస్తున్నారన్నారు. అలాగే పర్యాటకులు రాత్రుళ్లు బస చేసేందుకు బడ్జెట్ హోటళ్లను నిర్మించనునట్లు గెల్లుశ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో పర్యాటాభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. కాళేశ్వరం పరివాహక ప్రాంతాల్లో పర్యాటాకాభివృద్ధి చేస్తే సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్‌గడ్,మహారాష్ట్ర తో పాటుగా ప్రపంచంలోని అనేక దేశాలనుంచి అత్యధికంగా పర్యాటకులు వచ్చే అవకాశులున్నాయని చెప్పారు.