ఇవాళ మాజీసీఎం కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు.
ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.
కేసీఆర్ ఉదయం ఎర్రవల్లి నుంచి బయలుదేరి జనగామ జిల్లా దేవరుప్పల్ మండలం ధరావతండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అర్థం చేసుకుంటారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే భోజనం చేసి 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాయంత్రం బయలుదేరి నల్గొండ మీదుగా రాత్రి ఎర్రవల్లి చేరుకుంటారు.