తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల ఏడుగురు మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండల కేంద్రంలోని ఇంద్రకల్ సమీపంలో కోళ్ల ఫారం షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కూలీలు, యజమాని మల్లేష్, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఇదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగు పడి లక్ష్మణ్ (13) అనే బాలుడు మృతి చెందాడు. బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో పిడుగు పడి గోపాల్ రెడ్డి (45) ప్రాణాలు కోల్పోయాడు.
భారీ వృక్షం విరిగి..
గాలివానకు చెట్టు విరిగిపడి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కీసర మండలం తిమ్మాయిపల్లిలో పెద్ద ఎత్తున గాలివాన వచ్చింది. ఆ గాలివానకు చెట్టు విరిగి బైక్ పై వెళ్తున్న వారిపై పడడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు రాంరెడ్డి, ధనుంజయ్ లు గా గుర్తించారు.
ఈదురుగాలులు.. ఉరుములు, మెరుపులు..
రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోనూ పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కీసర, ఘట్‌కేసర్ ప్రాంతాల పరిధిలో భారీ గాలుల నడుమ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు సిటీ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.