హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటును సమీక్షించేందుకు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నద్ధ మవుతున్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి ప్రయివేట్ విశ్వవిద్యాలయాల పనితీరు, ప్రవేశాల్లో జరుగుతున్న అక్రమాలపై వస్తోన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ విశ్వవిద్యాలయాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తీసుకోవలసిన చర్యలను ఖరారు చేయాలని నిర్ణయించి నట్టు సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్, పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సచివాలయంలో రెండు రోజుల క్రితం సమీక్ష నిర్వహంచిన రేవంత్, ప్రయివేట్ వర్సిటీల అంశాన్ని ప్రసావించి నట్టు చెబుతున్నారు. ప్రయివేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి మంజూరు తనిఖీలు, ప్రవేశాలు రిజర్వేషన్ల అమలు ఫీజుల ఖరారు పరీక్షల నిర్వ#హణ తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదికను అంద జేయాలని రేవంత్ విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్టు తెలు స్తోంది. తెలంగాణాలో జిల్లాకొక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలుండగా ప్రైవేట్ రంగంలో వీటి అవసరం ఉందన్న విషయంలో స్పష్టత ఇవ్వా లని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇబ్బడి ముబ్బడిగా ప్రయివేట్ రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులిచ్చి విద్యను వ్యాపారంగా మార్చిందన్న విద్యార్థి సంఘాల ఆరోపణలను రేవంత్ తీవ్రంగా పరి గణిస్తున్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ, శాసనమండలిలో ప్రయివేట్ విశ్వ విద్యాలయాల బిల్లులను ప్రవేశపెట్టి తద్వారా అనుమతులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలుగా పనిచేసిన వారు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ప్రయివేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతులు పొందినట్టు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ప్రయివేట్ విశ్వ విద్యాలయాల్లో ఏ కోర్సులు ప్రవేశపెట్టాలన్నా సంబంధిత జాతీయ స్థాయి సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే అగ్రికల్చర్ (వ్యవసాయరంగ)లో డిగ్రీ, డిప్లమో కోర్సులను ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అనుమతులుండాలి. అలాగే ఫార్మసీ కోర్సులకు భారత ఫార్మసీ మండలి (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా), ప్యారా మెడికల్ కోర్సులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇంజనీరింగ్ కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులు ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో పేరొందిన ప్రయివేట్ విశ్వవిద్యాలయాలు ఎటువంటి జాతీయ విద్యాసంస్థల అనుమతులు లేకుండానే గత ఆరేళ్లుగా యథేచ్ఛగా ప్రవేశాలు జరుపుకుని పరీక్షలు నిర్వహిస్తున్నా అడిగే నాధుడే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కో ప్రయివేట్ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో ఐదారు వేల సీట్లను భర్తీ చేస్తూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌కు ఒక్కో విద్యార్థి రూ. 20 లక్షల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలపైనా వివరాలివ్వాలని రేవంత్ ఆదేశించినట్టు సమాచారం. విశ్వ విద్యాలయాలకు అనుమతులు ఇచ్చే సమయంలో అవలంబిస్తున్న విధానాలు, ఏటా తనిఖీల నిర్వహణ, ప్రవేశాల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై కూడా అధ్యయనం చేయాలనీ భావిస్తున్నట్టు అయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఐసీఏఆర్ అనుమతి లేకుండా విపక్ష పార్టీ మంత్రి ఒకరు హైదరాబాద్ శివార్లలో నిర్వహిస్తోన్న ప్రయివేట్ వర్సిటీలో గత ఏడాది బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో రెండు వేలకు పైగా ప్రవేశాలు నిర్వహించి ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.2 లక్షల నుంచి 3 లక్షల ఫీజు తీసుకున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపడంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖకు లేఖ రాయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు సమాచారం.
విపక్ష పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన వర్సిటీలో నిబంధనలకు విరుద్దంగా జరిపిన ప్రవేశాలపై కూడా ఆరా తీసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. చిక్కడపల్లి కేంద్రంగా గత నలభై ఏళ్లుగా వివిధ విద్యా సంస్థలను నిర్వహిస్తున్న యాజమాన్యం ప్రయివేట్ విశ్వవిద్యాలయం అనుమతికి దరఖాస్తు చేసుకోగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేత తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అడ్డంపడ్డ వైనాన్ని పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రేవంత్ దృష్టికి తీసుకురాగా ఈ విషయంలో పూర్తి సమాచారాన్ని తెప్పించాలని సదరు విద్యా సంస్థ చేసుకున్న దరఖాస్తును ఎందుకు పరిశీలించలేదని రేవంత్ ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ప్రయివేట్ వర్సిటీలపై సమీక్ష నిర్వహించాక న్యాయపరమైన సలహా తీసుకుని ముందుకెళ్లాలని రేవంత్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.