Wednesday, December 25, 2024

Top Story – మెతుకు పంచిన‌ మెద‌క్ చ‌ర్చి!

పేద‌ల ఆక‌లి తీర్చేందుకు నిర్మాణం
అందుకే మెతుకుసీమగా మారిన మెద‌క్‌
ప‌దేళ్లపాటు నిర్మించిన ప్రార్థ‌నాల‌యం
1924 డిసెంబ‌ర్ 25న ప్రారంభం
చ‌ర్చి నిర్మాణం జ‌రిగి రేప‌టికి వందేళ్లు
వాటిక‌న్ చ‌ర్చి త‌ర్వాత రెండో చ‌ర్చిగా ప్ర‌ఖ్యాతి
ప్ర‌పంచ క్రైస్త‌వుల‌కు ప‌విత్ర ప్రార్థ‌న స్థ‌లం
చ‌ర్చి నిర్మాణంలో ఎన్నెన్నో ప్ర‌త్యేక‌తలు
శ‌తాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా స్పెష‌ల్ స్టోరీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూస్‌నెట్ వ‌ర్క్ :
తెలంగాణ‌లో ఎంతో ప్రాధాన్యం గ‌ల మెదక్ కేథడ్రల్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చ‌ర్చిగా పేరుగాంచింది. ప్ర‌పంచంలో వాటిక‌న్ చ‌ర్చి త‌ర్వాత అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన రెండో చ‌ర్చిగా మెద‌క్ చ‌ర్చికి గుర్తింపు ఉంది. అందుకే.. భార‌త్‌కు వ‌చ్చిన ఇత‌ర దేశాల వారు త‌ప్ప‌కుండా చూసి వెళ్తుంటారు. మొద‌టి ప్ర‌పంచ యుద్ధ కాలంలో పేద‌వాడి ఆక‌లి తీర్చేందుకు ప‌దేళ్ల‌పాటు నిర్మించిన ఈ చ‌ర్చికి ఘ‌న చ‌రిత్ర ఉంది. ప్ర‌స్తుతం శ‌తాబ్ది ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.

ప‌నికి ఆహారం కింద నిర్మాణం

మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో జనం సమిధలయ్యారు. పనిలేక.. తిండిలేక, బతుకుదెరువు కష్టమై బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి భయంకరమైన కరువు పరిస్థితుల్లో క్రైస్త‌వ మిష‌న‌రీ రెవెరెండ్ చార్లెస్ వాక‌ర్ పోస్నేట్ కరుణామయుని ప్రార్థ‌నాల‌య నిర్మాణం చేపెట్టారు. గుక్కెడు మెతుకుల కోసం అల్లాడుతున్న జనానికి ఇలాగైనా కాస్త ప‌ని దొరికి క‌డుపు నిండుతుంద‌న్న ఆయన ఆలోచన. అప్ప‌ట్లో ప‌నికి ఆహారం కింద ఈ చ‌ర్చి నిర్మాణం చేప‌ట్టారు. ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో, వారికి ఆహారం ఇవ్వబడుతుంది అని ప్ర‌క‌టించారు. వివిధ ప్రాంతాల నుంచి కూలీలు ఇక్క‌డ‌కు వ‌చ్చి ప‌నిలో పాల్గొన్నారు. 1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం 1924 డిసెంబర్ 25న పూర్తైంది. పదేళ్ల పాటు సుమారు 12 వేల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలుపంచుకుని ఆక‌లి తీర్చుకున్నారు. ఈ చర్చి నిర్మాణంతోనే ‘మెతుకు సీమ’ అనే పేరు వచ్చిందని అంటారు.

- Advertisement -

వెయ్యి ఎక‌రాలు ఇచ్చిన నిజాం న‌వాబులు

మెదక్ కేథడ్రల్ చర్చికి చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం న‌వాబులు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. తొలుత దీన్ని 180 అడుగుల ఎత్తుతో నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు. అయితే చార్మినార్ ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదని నాటి పాలకులు ఆదేశించడంతో ఎత్తు 5 అడుగులు తగ్గించి నిర్మాణం పూర్తి చేశార‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ చర్చి నిర్మాణానికి కేవలం రాతి, డంగు సున్నాన్ని మాత్ర‌మే వాడారు. పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం, ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి, మేస్త్రీలను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకున్న విధంగా నిర్మించారు.

అద్భుత క‌ట్ట‌డం…

మెదక్ కేథడ్రల్ చర్చికి క‌ట్ట‌డాలు అద్భుతంగా ఉంటాయి. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవీగా కనిపించే ఈ చర్చిని భారతీయ, విదేశీ కళా నైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తైనా చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. రంగు రంగుల గాజు ముక్కలతో చర్చి లోపలి భాగంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఏసుక్రీస్తు పుట్టుక, శిలువ వేయడం, ఆరోహణం ఇవన్నీ ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. ఇవన్నీ ఒకే గాజుపై వేసినవి కాదు. ఇంగ్లండ్‌లో గాజు ముక్కలపై విడివిడిగా పెయింటింగ్ వేసి ఇక్కడికి తీసుకొచ్చి అమర్చారు. ఇవి సూర్య కిరణాలు పడితేనే కనిపిస్తాయి. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్యే ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి. 6 గంటల తర్వాత ఫ్లడ్ లైట్స్ వేసి వెతికినా కనిపించవు. దీని వెనుక ఉన్న సైన్స్ అందరినీ అబ్బురపరుస్తుంది.

సూర్య కిర‌ణాల వ‌క్రీభ‌వ‌నంతో విర‌జిమ్ముతున్న వెలుగులు

మెదక్ కేథడ్రల్ చర్చికి ఉత్తరం దిక్కున ఉన్న మూడో కిటికీపై అసలు సూర్య కిరణాలే పడవు. అయినా, అది ప్రకాశిస్తుంది. ఇక్కడి రాళ్లపై సూర్య కిరణాలు వక్రీభవనం చెంది ఆ కిటికీపై పడటం వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. చర్చి నిర్మాణంలో వాడిన మార్బుల్స్‌ను ఇంగ్లండ్, ఇటలీ నుంచి తీసుకొచ్చారు. చర్చి లోపల రీసౌండ్ రాకుండా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement