Sunday, January 19, 2025

Top Story – కశ్మీర్లో మిస్టరీ డెత్స్

ఆంధ్ర‌ప్ర‌భ‌, సెంట్ర‌ల్ డెస్క్‌:జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ ప్రాంతంలో 45 రోజుల వ్యవధిలో 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, వికారం, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలతో బధాల్ గ్రామ ప్రజలు స్థానిక ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కొద్ది రోజుల తర్వాత అక్క‌డే మరణిస్తున్నారు. దీంతో ఏదో అంతుచిక్కని వ్యాధి ప్రబలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే.. చండీగఢ్‌లోని పీజీఐమర్ సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వంటి వివిధ సంస్థలు ఇప్పటికే రంగంలోకి దిగినప్పటికీ మరణాలకు గల కారణం తెలియరాలేదు. ఇటీవల మరో మహిళ ఆస్పత్రిలో చేరడంతో జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

- Advertisement -

బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు వైద్యాధికారులు పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఊర్లోనే..డాక్ట‌ర్లు ఆ గ్రామంలో ముందు జాగ్రత్త చర్యలు చేప‌ట్టారు.

డిసెంబరు 7వ తేదీ నుంచి ఊరిలోనే ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ముందు జాగ్రత్త చర్యలపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరో 8 నుంచి 10 రోజుల్లోగా అంతుచిక్కని మరణాలకు సంబంధించిన వివరాలు బయటికి వస్తాయని డాక్ట‌ర్లు తెలిపారు. శాంపిళ్లను సేక‌రించామ‌ని, మెడిక‌ల్ టెస్టులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు.

కార‌ణాలపై అన్వేష‌ణ‌..

మిస్టరీ మరణాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కారణాలు తెలుసుకునేందుకు తక్షణమే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోంశాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వ్యవసాయశాఖ, ఎరువులు, రసాయనాల శాఖ, జలవనరుల శాఖకు చెందిన నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. వీరికి పశుపోషణ, ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్స్‌, ఫుడ్‌ సేప్టీ అధికారులు సహకరిస్తారు.

అధ్య‌య‌నం కోసం బృందం..

బాధితులకు తక్షణ సాయం అందించి భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై కసరత్తు చేస్తున్న‌ట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ తరహా ఘటనలపై అధ్యయనం చేసేందుకు దేశంలోని అత్యంత ప్రముఖ సంస్థల నుంచి నిపుణులను కూడా కేంద్రం సిద్ధం చేసింది. స్థానిక అధికారులతో కలిసి ఆదివారం దర్యాప్తు ప్రారంభించింది.

మొత్తానికి కశ్మీర్లో మిస్టరీ మరణాలపై మరింత అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.మెద‌డువాపుగా నిర్ధారించిన స్థానిక డాక్ట‌ర్లు..నెల రోజుల వ్య‌వ‌ధిలో 16 మంది అనుమానాస్పదంగా చ‌నిపోవ‌డం ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ దిగ్భ్రాంతిక‌ర ప‌రిస్థితిల‌ను స‌రిచేయ‌డానికి ఆరోగ్య శాఖ నిపుణులు జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా బుధాల్ గ్రామంలో ప‌ర్య‌టించారు.

గ్రామంలోని మరణాలు న్యూరోటాక్సిన్‌ల వల్ల సంభవించాయని నిర్ధారణ‌కు వ‌చ్చారు. చనిపోయిన వారంతా మెదడు వాపు లేదా ఎడెమాతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. మృతుల్లో ఆ మూడు కుటుంబాల వారే..దేశంలోని ప్రధాన ప్రయోగశాలలు విశ్లేషించిన శాంపిల్స్‌లో లభించిన న్యూరోటాక్సిన్స్ మెదడు దెబ్బతినడానికి కారణమయ్యాయని డాక్టర్ భాటియా చెప్పారు.

గ్రామం నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే, ఇతర ప్రయోగశాలల్లో విశ్లేషించారు. పరీక్ష ఫలితాల్లో ఎలాంటి వైరస్ కానీ, బ్యాక్టీరియాతో మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్టు లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. దీంతో అంటువ్యాధిగా కానీ ఉందేమో అనే సందేహాలు వ‌చ్చాయ‌ని, కానీ పరీక్షల‌ శాంపిల్స్‌లో టాక్సిన్స్‌ ఉన్నట్లు తేలిందన్నారు.

ఇక‌.. చ‌నిపోయిన వారంతా మూడు కుటుంబాలకు చెందినవారు కావడంపై కూడా సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాగా, డిసెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ మధ్య బుధాల్ గ్రామంలో సంభవించిన 16 మరణాల వెనుక మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం రాజౌరి పోలీసులతో విచారణకు ఆదేశించింది. రాజౌరి పోలీసులు కేసు దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement