హైదరాబాద్, : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎంపిక ప్రక్రియకు ముహూర్తం ముంచు కొస్తోంది. గురువారం మేయర్ ఎన్నిక పూర్తి కావాల్సి ఉన్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరనేది సీల్డ్ కవర్‌లో నిక్షిప్తమై ఉంది. మేయర్ అభ్యర్థి ఎంపికలో మజ్లిస్ మద్దతు తీసుకోబోమని గతంలో టీఆర్‌ఎస్ ప్రక టించింది. మరో పక్క మేయర్, డిప్యూటీ మేయర్ ను దక్కించుకునేందుకు కావాల్సిన సంఖ్య లేనప్ప టికీ పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 44 మంది కార్పొరేటర్లు ఉన్న మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, మేయర్ ఎన్నిక రోజు ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహం ఏంటి అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌కు 56 మంది, బీజేపీకి 48 మంది, ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొ రేటర్లు ఉన్నారు. వీరితో పాటు టీఆర్‌ఎస్‌కు 32 మంది, ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక్క ఓటు ఎక్స్‌ఆఫీషియో సభ్యులున్నారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏ పార్టీకి ఎక్కువ మంది సభ్యుల బలముందో ఆ పార్టీకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పొరేటర్లకు మరో 32 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల బలము ఉన్నందున మొత్తం 88 మంది ఓట్లతో సునాయాసంగా మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకోనుంది.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎంఐఎం ప్రమేయం లేకుండానే అధికార పార్టీ రెండు పీఠాలనూ చేజిక్కించుకోనుంది. రద్దయిన కార్పొరేషన్ పాలక మండలిలో టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఒకానొక సందర్భంలో ఇరుపక్షాలు పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో గెలుపు అవకాశాలున్న కొన్ని చోట్ల మాత్రమే ఎంఐఎం పోటీ చేయడంతో ఇరు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఇందుకు తగినట్లుగానే టీఆర్‌ఎస్ నేతలెవరూ ఎంఐఎం పోటీ చేసే ప్రాంతాల్లో కనీసం ప్రచారం కూడా నిర్వహించలేదు. ఎన్నికల అనంతరం ఎంఐఎం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై ఎలాంటి ప్రకటన చేయకపోగా, టీఆర్‌ఎస్ మాత్రం మేయర్ అభ్యర్థి ఎవరనేది సీల్డ్ కవర్‌లో పంపిస్తామని చెప్పిన కేసీఆర్ డిప్యూటీ మేయర్ విషయాన్ని ప్రస్తావించలేదు.
అధికార పార్టీ వ్యూహం ఏంటి? మజ్లిస్ మద్దతు తీసుకుంటుందా?
మరోవైపు బీజేపీకి మజ్లిస్ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్‌ఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్ చేయడమా? మొత్తానికే గైర్హాజరు కావడమా అనే అంశాలపై లోతుగా చర్చించి ఓ కీలక నిర్ణయం గురువారం పార్టీ కార్పొరేటర్లతో జరిగే సమావేశంలో తీసుకోనున్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్ బరిలో బీజేపీ….
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ పదవులలో ఎవరిని పోటీలో దింపాలన్న అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం ఆ పార్టీ కార్పొరేటర్లతో బీజేపీ నేతలు భేటీ అవుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకుంది. మరో ముగ్గురు ఎక్స్‌అఫీషియో సభ్యులున్నారు. మొత్తం 51 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో కొద్ది రోజుల క్రితం ఒక కార్పొరేటర్ అనారోగ్యంతో కన్నుమూశారు. మొత్తంగా బీజేపీకి కేవలం 50 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు దక్కాలంటే కనీసం 97 మంది బలముండాలి, కానీ ఆ సంఖ్య లేనప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కమలం పార్టీ భావిస్తోంది. కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై కౌన్సిలర్లకు రాష్ట్ర నేతలు దిశా, నిర్దేశం చేయనున్నారు. ఢిల్లిdలో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్ హైదరాబాద్‌లో భేటీ అయిన నేతలతో జూమ్ సమావేశం ద్వారా కొన్ని సూచనలను చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు, గ్రేటర్ పరిధిలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. గురువారం జరిగే సమావేశంలో పార్టీ ఫ్లోర్ లీడర్, విప్‌లను కూడా ఖరారు చేయనున్నారు.
రేపే మేయర్ ఎన్నిక…
Advertisement
తాజా వార్తలు
Advertisement