Saturday, September 7, 2024

Big Story | హైరేంజ్​లో టమాటా ధరలు.. తెలంగాణలో కిలో 200కి పైగానే..

హైదరాబాద్‌, ఆంధ్రపభ : కొండెక్కి కూర్చున్న టమాట ధరలు ఇప్పట్లో తగ్గేపరిస్థితులు కనిపించడం లేదు. నిన్నమొన్నటి వరకు సెంచరీ దాటిన ధరలు ఇప్పుడు డబుల్‌ సెంచరీకి చేరువలో ఉన్నాయి. దాదాపు నెల రోజులుగా రాష్ట్రంలో టమాట ధరలు దిగిరావడం లేదు. కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 దాకా పలుకుతుండడంతో టమాట కొనాలంటేనే సామాన్యులు బెంబేళెత్తిపోతున్నారు. దాదాపు నెల క్రితం రాష్ట్రంలో కిలో టమాట ధర రూ. 50లోపే ఉంగా ఇప్పుడు రూ.150 నుంచి రూ.200 మధ్యన అమ్ముడవుతోంది. జిల్లా కేంద్రాల్లో కంటే గ్రామాల్లోనే టమాట ధరలు అధికంగా ఉండడంతో పేద, సామాన్యులు టమాట కొనాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

- Advertisement -

నెలరోజులు దాటుతున్నా తగ్గని ధరలు…

టమాట ధరలు వారం, పది రోజుల్లో తగ్గుతాయని రెండు వారాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ దిశగా పరిస్థితులు కనిపించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. టమాట ధరలు ఎప్పుడు తగ్గుతాయా..? అని సామాన్యులు ఎదరుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది వేసవి ముగింపులో యాసంగి టమాట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురవడంతో పంట నాశనమై టమాట ధరలు పెరిగాయని, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతికాకుండా ఆ ఆరాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో రవాణాకు ఆటంకంతోపాటు టమాట పంట దెబ్బతిని మరో మారు ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెటింగ్‌శాఖపై వినియోగదారుల ఆగ్రహం…

దాదాపు నెల రోజులుగా వేచి చూస్తున్నా టమాట ధరలు దిగిరాకపోవడానికి మార్కెటింగ్‌శాఖ వైఫల్యమన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ధరల నియంత్రణపై రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ఎలాంటి దృష్టిపెట్టకపోవడంతో వ్యాపారులు తమకు ఇష్టమొచ్చిన ధరలకు టమాటను విక్రయిస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టమాట సాగు లేకపోవడంతో ఏపీ, మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతోంది. అక్కడ నుంచి అతి తక్కువ ధరలకు తెలంగాణకు టమాటను తెప్పిస్తున్న వ్యాపారులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులేటమాట ధరలను నిర్ణయించి వినియోగదారులకు విక్రయిస్తున్నారని మండిపడితున్నారు. ఇకనైనా మార్కెటింగ్‌శాఖ స్పందించి టమాట ధరల పెరుగుదలకు కళ్లెం వేసేలా పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చండీగడ్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన కిలో టమాటా ..

పెరిగిన టమాట ధరలు దేశవ్యాప్తంగా ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. తెలంగాణలో కిలో టమాట ధర రూ.200ను తాకగా… చాలా రాష్ట్రాల్లో రూ.200 నుంచి రూ.250కి కిలో టమాటాను విక్రయిస్తున్నారు. ఇక చండీగడ్‌ మార్కెట్‌లో రిటైల్‌ దుకాణాల్లో ఏకంగా కిలో టమాటను రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తుండడం గమనార్హం. టమాట ధరలు రోజు రోజుకు పెరగటమే కాని తగ్గకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లీటర్‌ పెట్రోల్‌ కంటే కిలో టమాట ధరనే అధికంగా ఉందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌లో టమాటాల లారీ బోల్తా..భారీ బందోబస్తు ఏర్పాటు

దేశ వ్యాప్తంగా టమాటల రేటు ఆకాశాన్నంటుతున్న పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో నేషనల్‌ హైవే 44పై టమాటాలను తరలిస్తున్న లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన టమాటాలను తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. అందినకాడికి టమాటాలను తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న రైతులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోల్తాపడిన లారీ కర్ణాటకలోని కోలార్‌ నుంచిటమాటాల లోడ్‌తో ఢిల్లి వెళుతున్నట్లు తెలిసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement