బైంసా ప్రభ న్యూస్ – నిర్మల్ జిల్లా భైంసాలో నిన్న కేటీఆర్ రోడ్ షో లో కేటీఆర్ పై టమాటాల దాడి కేసులో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైంసా లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీసు బందోబస్తులో శాంతియుతంగా బైంసా ఉందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. విలేకరులతో నేడు ఆమె మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్‌లో హనుమాన్ భక్తుల ఆందోళన,కేటీఆర్ వాహనం పై దాడి కేసులో 23 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతానికి నలుగురిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఎవరైనా ఉద్రిక్త వాతావరణానికి పాల్పడిన కఠిన చర్యలు తప్పవని, ప్రజలు రూమర్స్ నమ్మక సంయమనం పాటించాలన్నారు. అయితే బీజీపీ శ్రేణులు మాత్రం ఇది అక్రమ అరెస్టులనీ వాపోతున్నారని తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లలో హనుమాన్ దీక్ష స్వాములు కూడా వున్నారని వెల్లడించారు
కాగా, 23 మందిపై 307,120 B, 143 ,144,147, 148R/W 149 IPC సెక్షన్ ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా.. నిన్న నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు మధ్య తోపులాట జరిగింది. సభ స్థలం వద్దకు రాకుండా హనుమాన్ దీక్ష స్వాములను తాళ్లతో బారికేడ్లతో నిర్బంధించారు. కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ ప్రసంగిస్తూ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇచ్చే సమయాన అవతల వైపు నుండి స్వాములు జైశ్రీరామ్ అంటూ నినాదాలు ఇవ్వగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న కేటీఆర్ పై కొందరు టమాటాలు, ఉల్లిగడ్డలు, వంకాయలతో దాడి చేశారు. మీటింగ్ లో ఉన్న పక్క వారిపై అవి పడడడంతో రాముడు ఇలానే ఇతరులపై దాడి చేయమన్నాడా అంటూ కేటీఆర్ ప్రశ్నించాడు. భారీ బందోబస్తుతో పోలీసులు స్వాములను, బీఆర్ఎస్ కార్యక్రర్తలను చెదరగొట్టారు. ప్రసంగం ముగిసిన వెంటనే కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.