Friday, November 22, 2024

నేడో, రేపో రాజగోపాల్‌రెడ్డి సస్పెండ్‌? అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు కంప్లెయింట్‌ చేయనున్న కాంగ్రెస్​

హైెదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నేడో, రేపో వేటు వేస్తారని, సస్పెన్షన్‌ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌క మానిక్యం ఠాగూర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. షోకాజ్‌ నోటీసు లేకుండానే సస్పెన్షన్‌ వేటు వేస్తారని సమాచారం. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయని, బీజేపీ బలం పుంజుకోంటోందనడంతో పాటు సోనియాగాంధీకి ఈడీ నోటీసులపై చట్టం తన పని తాను చేసుకుంటుందన్న వ్యాఖ్యాలపై ఏఐసీసీ నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినప్పటికి ఆయనకు, ఆయన కుటుంబానికి పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పార్టీ నేతలు వివరించారు. పార్టీ నుంచి సస్పండ్‌ చేసిన వెంటనే రాజగోపాల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా, మునుగోడు నియోజక వర్గ నేతలు, పార్టీ కార్యకర్తలతో రాజగోపాల్‌రెడ్డి రెండు రోజులుగా సమావేశం నిర్వహిస్తున్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయింఉకున్నారని, అందుకు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని పార్టీ కేడర్‌ను కోరారు. దీంతో సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు, కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిసింది. అభివృద్ధి కోసం రాజీనామా చేయడాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు మాత్రం అభివృద్ది లేకున్నా పర్వాలేదని, ఎమ్మెల్యేగానే కొనసాగాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

ఆగస్టు 10 తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా..?
కాంగ్రెస్‌ పార్టీ సస్పెండ్‌ చేయక ముందే.. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా రాజగోపాల్‌రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి మాత్రం ఆగస్టు మొదటి వారంలో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకన్నట్లుగా తెలిసింది. ఒక వైపు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమవేశం నిర్వహిస్తూనే.. మరో వైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మాజీ ఎంపీ వివేక్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. రెండు, మూడు రోజుల్లో మరోసారి ఢిల్లిdకి వెళ్లి, బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యం కానుందని చెబుతున్నారు.

రాజగోపాల్‌రెడ్డితో కేడర్‌ వెళ్లకుండా చర్యలు..
కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే నష్టం జరగకుండా.. ముందుగానే దిద్దుబాటు చర్యలను చేపట్టాలనే యోచనలో ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి వెంట నాయకులు వెళ్లకుండ కట్టడి చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు అధిష్టానం సూచించనుందని పార్టీ నేత ఒకరు తెలిపారు. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో మునుగోడు నియోజక వర్గం ఉందని, ప్రస్తుతం భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నందున, ఆయనకే నియోజక వర్గ బాధ్యతలు ఇవ్వడం వల్ల కేడర్‌ బయటికి వెళ్లకుండా చూస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ బిక్ష పెట్టిన పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో రాజగోపాల్‌రెడ్డి చేతులు కలపడం సమంజం కాదని టీ పీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలస్‌ నేత అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వస్తే టికెట్‌ ఎవరికిచ్చినా 50 వేల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. వారంలో రోజుల్లో నియోజక వర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement