రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మునుగోడుకు వెళ్లనున్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమైంది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయమైంది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సీఎం కేసీఆర్ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికకు సమరశంఖం పూరించనున్నారు. ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు.
సుమారు 4వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. ప్రజా దీవెన సభకు సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.