డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. 2009 సరిగ్గా ఇదే రోజున తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు పునాదిరాయి పడిన రోజు అని అన్నారు.
అదేవిధంగా సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సోనియమ్మ నేరవేర్చిందని పేర్కొన్నారు. ఉద్యమంలో సబ్బండ వర్గాలను నడిపించిన మూర్తి తెలంగాణ తల్లి అని అన్నారు. నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపిన స్ఫూర్తి తెలంగాణ తల్లిదే అని తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని.. నిండైన రూపాన్ని తీర్చిదిద్ది సచివాలయంలో ఆవిష్కరిస్తున్నామని అన్నారు.
మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందని సీఎం పేర్కొన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండే పంటలతో తల్లి దర్శనమిస్తుందని సీఎం తెలిపారు.