Tuesday, November 26, 2024

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

తెలంగాణ లోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. రెండు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉండటంతోపాటు పోలింగ్‌ కూడా భారీగా జరగటంతో ఫలితాలు వెలువడేందుకు ఒకటిన్నర నుంచి రెండు రోజుల వరకు పడుతుందన్న అభిప్రాయం ఎన్నికల సంఘం అధికారుల్లో కూడా వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 93 మంది పోటీ చేయగా 3,57,354 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా 3,86,320 మంది ఓట్లు వేశారు.


ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్కో కేంద్రంలో ఎనిమిది గదు
ల్లో ఏడేసి టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పట్టనున్న దృష్ట్యా మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి చెప్పారు. ఒకసారి లెక్కింపు కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది బయటకు వెళ్లేందుకు అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సెల్‌ఫోన్లు, కాగితాలు, పెన్నులను బయట నుంచి తెచ్చుకునేందుకు అనుమతించమని, వాటిని అధికారులే అందిస్తారని వివరించారు.

కాగా కౌంటింగ్ సుదీర్ఘంగా సాగనున్న నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఇవాళ కష్టమేనని భావిస్తున్నారు. అందుకు రెండ్రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. నేటి రాత్రి 9.30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్లను కట్టలు కట్టడానికే సరిపోతుందని, ఆ తర్వాతే తొలి రౌండ్ ఫలితం వెల్లడవుతుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement