తిరుమల – తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో సోమవారం గజవాహన సందర్భంగా సోమవారం ఉదయం శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి మాడ వీధుల్లో ఊరేగించి తిరుచానూరుకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని గరుడ సేవ మాదిరిగానే, తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఐదో రోజు సాయంత్రం గజ వాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు.
ఇందులో భాగంగా తిరుమల ఆలయంలోని లక్ష్మీ కాసుల హారాన్ని మాడ వీధుల్లో ఊరేగించి తిరుచానూరు ఆలయానికి తీసుకెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సాయంత్రం నిర్వహించనున్న గజ వాహన సేవలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.