Sunday, September 22, 2024

ADB: అరణ్యంలో పెద్దపులి సంచారం… కాలి ముద్రల గుర్తింపు..

ఇక్కడే మకాం వేసి తిరుగుతున్న బెబ్బులి !
జన్నారం, సెప్టెంబర్ 22 (ప్రభ న్యూస్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం డివిజన్ లోని ఓ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని అడవులను కలుపుతూ కవ్వాల పులుల అభయారణ్యం (కవ్వాల టైగర్ జోన్) 2012 ఏప్రిల్ 10న ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలోని ఉడుంపూర్ రేంజ్, మంచిర్యాల జిల్లాలోని కవ్వాల అభయారణంలోని జన్నారం డివిజన్ ఇందనపల్లి రేంజ్ అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు, ఆ పెద్దపులి అడుగులను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు, అటవీ అధికారులు గుర్తించారు.

గత నెల 21న జన్నారం రేంజులోని గొండుగూడ అటవీ ప్రాంతానికి వచ్చి మండలంలోని జువ్విగూడ గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతు ఆవు, లేగ దూడపై దాడి చేసింది. అప్పుడు వచ్చిన పెద్దపులి ఇదే అటవీ ప్రాంతంలో ఉండి సంచరిస్తుంది. ఈ అటవీ ప్రాంతం దట్టంగా ఉండి, శాఖాహార జంతువులు ఎక్కువగా ఉండడంతోనే ఇక్కడే మకాం వేసి ఉన్నట్లు తెలిసింది.

ఓ సీసీ కెమెరాకు ఆ పెద్దపులి ఛాయాచిత్రం చిక్కినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ ను ఆదివారం సాయంత్రం సంప్రదించగా, ఆ పెద్దపులి అడుగులను అడవుల్లోని ఓ ప్రదేశంలో గుర్తించామన్నారు. గత నెల నుంచి ఆ పెద్దపులి ఇక్కడే మకాం వేసి సంచరిస్తుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement