Top Story – వణుకు పుట్టించి.. వలలో చిక్కి..!
- చంద్రాపూర్ జూపార్క్ లో మగ పులికి వైద్య పరీక్షలు..
- మేటింగ్ కోసమే వార్ధా నది దాటి వచ్చిన వ్యాఘ్రం…!
- ముగ్గురు ప్రాణాలను తోడేసిన పెద్దపులి ఇదే..!
- ఊపిరి పీల్చుకుంటున్న సరిహద్దు గ్రామాల ప్రజలు..!
ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : బెబ్బులి గాండ్రింపులు… వరుస దాడులతో వణికి పోతున్న కొమురం భీం జిల్లా ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. పెద్దపులి భయానికి పంటచేలకు వెళ్లేందుకు వెనుకాడిన రైతులు తమ పంట పొలాలు చూసేందుకు అడుగులు వేస్తున్నారు. కాగజ్ నగర్ డివిజన్ లో రెండు నెలలుగా కంటిమీద కునుకు లేకుండా చేసిన మగ పులిని మహారాష్ట్ర పరిధిలోకి వచ్చే చంద్రాపూర్ జిల్లా ఆత్మరామ్ గూడ శివారులో మత్తుమందిచ్చి, బంధించి చంద్రపూర్ జూ పార్కు కు తరలించారు. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో హ డలెత్తించిన ఈ పెద్ద పులికి వైద్య పరీక్షలు, చికిత్స అనంతరం చంద్రపూర్ జిల్లా “తడోబా టైగర్ రిజర్వ్” పులుల సంరక్షణ కేంద్రానికి తరలించేలా అక్కడి అటవీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- జతకట్టేందుకు వార్తా నది దాటి వచ్చిన మగ పులి…
సరిహద్దు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, చత్తీస్గడ్ లోని ఇంద్రావతి అభయారణ్యం నుండి నాలుగు దిక్కులా పెద్ద పులుల వలసలు పెరిగాయి. ఇక్కడ హడలెత్తించిన పులి వైన్ గంగ నది దాటి తెలంగాణలోకి వచ్చిందనీ అటవీ అధికారులు భావించారు. కానీ డిఎన్ఏ పరీక్షలు, పాదముద్రల ఆధారంగా ఈ బెబ్బులి ఆడ పులి కోసం అన్వేషిస్తూ మేటింగ్ కోసం వార్డానది దాటి కాగజ్నగర్ టైగర్ జోన్ కు రెండు నెలల క్రితం వచ్చిందని తేలింది. కాగజ్నగర్ డివిజన్లో ఒక ఆడ పులి తో పాటు కెరమెరి జోడేఘాట్ ఏరియాలో మరో ఆడ పులి ఉన్నట్టు నిర్ధారించారు. జతకట్టేందుకు వచ్చిన ఈ పెద్దపులిని కవ్వాల్ అభయారణ్యo వైపు తరలించేలా ఇక్కడి అధికారులు ప్రయత్నించారు. అయితే కాగజ్ నగర్ నుండి కవ్వాల్ టైగర్ జోన్ కు అనువైన కారిడార్ ఏర్పాటు చేయకపోవడం, మధ్యలో 4 వరసల జాతీయ రహదారి, కైరిగుడ ఓపెన్ కాస్ట్ సింగరేణి గని అద్దంకిగా మారడంతో ఈ పెద్దపులి తిరిగి కాగజ్నగర్ , సిర్పూర్ టి మీదుగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా వైపు వెళ్తుండగా వారం రోజులు పసిగట్టి అక్కడి అధికారులు బంధించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. త్వరలోనే తాడోబా టైగర్ రిజర్వ్ ప్రాంతానికి ఈ పులిని తరలిస్తున్నట్టు అక్కడి అటవీ అధికారుల ద్వారా తెలిసింది.
ముగ్గురిని పొట్టన పెట్టుకున్న పెద్ద పులి..
8 ఏళ్ల వయసున్న ఈ మగ పులి ఆడ పులి కోసం అన్వేషిస్తూనే ముగ్గురు మనుషుల ప్రాణాలను తోడేసింది. తడోబా అభయారణ్యం నుండి రెండు నెలల క్రితం తెలంగాణలో ప్రవేశించిన ఈ పులి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో దోబూచులాడింది. ఈ పులి చంద్రపూర్ జిల్లాలోని రాజుర ప్రాంతంలో ఆదివాసి రైతులు జంగురాం , లాలూ బాయి నీ వెంటాడి హతమార్చగా, నవంబర్ 29న కాగజ్ నగర్ మండలం గన్నారం పంట చేనులో మోర లక్ష్మి (29) పై దాడి చేసి పొట్టన పెట్టుకుంది. మరుసటి రోజు నవంబర్ 30న సిర్పూర్ టి మండలం దుబ్బగూడ వద్ద రౌతు సురేష్ అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
- ముందుగా ఈ పెద్దపులిని మ్యాన్ ఈటర్ గా భావించిన అటవీ అధికారులు డిఎన్ఏ పరీక్షల ద్వారా ఆడ పులి కోసం అన్వేషిస్తూ బిత్తర చూపులతో ప్రయాణం సాగిస్తూ మనుషులపై దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు మహారాష్ట్ర అటవీ సిబ్బంది వలలో పెద్దపులి చిక్కిందన్న వార్తతో కాగజ్ నగర్ డివిజన్లోని ఏడు మండలాల ప్రజలు , ముఖ్యంగా రైతులు ఊపిరి పీల్చుకొని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.