Tuesday, November 26, 2024

థైరాయిడ్‌ సమస్యలు పెరిగినయ్​.. బాధిత రాష్ట్రాల్లో టాప్​ 4లో తెలంగాణ..

తెలంగాణ రాష్ట్ర ప్రజలను థైరాయిడ్‌ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. థైరాయిడ్‌ వ్యాధి గ్రస్థులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4 స్థానంలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 35-49 ఏళ్ల మద్య వయసు ఉన్న మహిళలపై థైరాయిడ్‌ వ్యాధి విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 5763 మందిలో థైరాయిడ్‌ సమస్యలు ఉన్నట్లు జాతీయ కుటుంబ సర్వే-5లో తేలింది. ఈ విషయాలను ఇటీవల లోక్‌సభకు కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ సమర్పించింది. జాతీయ కుటుంబ సర్వే-4 ప్రకారం థైరాయిడ్‌ వ్యాధి దేశ ప్రజల్లో 2.2శాతం మందికి ఉండగా… ఏడాదికాలంలోనే అంటే జాతీయ కుటుంబ సర్వే-5లో 2.9శాతానికి పెరిగింది. ఏటికేడు అటు దేశ వ్యాప్తంగా, ఇటు రాష్ట్రంలోనూ థైరాయిడ్‌తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్‌ సమస్యలు పురుషులు, మహిళల్లో తలెత్తుతున్నప్పటికీ ఈవ్యాధి బారిన ఎక్కువగా మహిళలే పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల్లో 15-19 వయస్సు ఏజ్‌ గ్రూప్‌లో 0.7శాతం మేర , 20-34 వయస్సు గ్రూప్‌లో 1.8శాతం మేర, 35-49 ఏజ్‌ గ్రూప్‌లో 3.4శాతం మేర థైరాయిడ్‌ వ్యాధిగ్రస్థులు ఉన్నారు.

దేశంలో ప్రతి లక్ష మందికి ధైరాయిడ్‌ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో కేరళ 8696 మందితో, రెండో స్థానంలో జమ్మూ కశ్మీర్‌, మూడో స్థానంలో ఢిల్లి, నాలుగో స్థానంలో 5763 మందితో తెలంగాణ నిలిచింది. శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్‌ విడుదలలో హెచ్చుతగ్గులనే థైరాయిడ్‌ సమస్యగా పరిగణిస్తున్నారు. భౌగోళిక పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, అయోడిన్‌ లోపం తదితర సమస్యల కారణంగా శరీరంలో థైరాయిడ్‌ హార్మోన్‌ అసమతౌల్యత తలెత్తుతుంది. ఈ మధ్యకాలంలో థైరాయిడ్‌ సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అధిక రక్తపోటు, షుగర్‌ వ్యాధి లాగానే థైరాయిడ్‌ వ్యాధి కూడా సర్వసాధారణం అయిపోయింది. జాతీయ కుటుంబ సర్వే-5లో తేలిన మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే గ్రామాల్లోని వాళ్లకంటే పట్టణాల్లో నివ‌శించేవాళ్ల‌లోనే ఎక్కువ థైరాయిడ్‌ రోగులు ఉన్నారు. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, సాంప్రదాయ ఆహారాని కంటే ఎక్కువగా జంక్‌ ఫుడ్‌, ఆధునిక ఆహార అలవాట్ల కారణంగా పట్టణాల్లోని వారికి ఊబకాయం పెరిగి శరీరంలో థైరాయిడ్‌ హార్మ్‌న్‌ సమతౌల్యత దెబ్బతింటోంది. అదే గ్రామీణ ప్రజల్లో థైరాయిడ్‌ సమస్యలు తక్కువగానే ఉన్నాయి.

థైరాయిడ్‌ హర్మోను ప్రభావం లేని అవయావాలు శరీరంలో లేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. థైరాయిడ్‌ సమస్యలు తలెత్తితే మహిళల్లో పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని స్పష్టం చేస్తున్నారు. థైరాయిడ్‌ సమస్యల కారణంగా పురుషుల్లో, మహిళల్లో బీపీ, గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయంటున్నారు. మానసిక ఆందోళనతోపాటు నిద్రపట్టకపోవడం, చిరాకు తదితర అనారోగ్య సమస్యలు థైరాయిడ్‌ అసమతౌలత్య కారణంగా తలెత్తుతున్నాయని తేలింది.

ఉన్నత ఆదాయవర్గాల వారు ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. ఊబకాయంతో బరువు పెరిగి హైపో థెరాయిడ్‌ ఉత్పత్తి, ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఆహార అలవాట్లలో సమతౌలత్యతను పాటించాలి. థైరాయిడ్‌ హార్మోన్‌ విడుదలకు హాని కలిగించే ఆహారానికి దూరంగా ఉండాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్‌, పాలకూర, దుంపలు, గెనుసు గడ్డ వంటి ఆహార పదర్థాలు తినకూడదు. ప్రాణాయామం, యోగాతో హార్మోన్‌ ఉత్పత్తిలో సమతౌల్యత సాధ్యమవుతుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం కారణంగా బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement