Sunday, November 24, 2024

కుటుంబంలో కరోనా విషాదం.. రూ.80 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణాలు

కరోనా ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. ఎందరో తల్లిదండ్రులకు బిడ్డలు లేకుండా చేసింది. మరెందరో చిన్నారులకు కన్నవారిని దూరం చేసింది. మరికొన్ని కుటుంబాల్లో తల్లినో, తండ్రినో శాశ్వతంగా దూరం చేసి అంతులేని విషాదంలోకి నెట్టేసింది. తాజాగా ఓ కుటుంబంలో ముగ్గురిని బలిగొంది. నెల రోజుల వ్యవధిలోనే కుటుంబంలో తల్లి, కుమారుడు, కుమార్తె కరోనాకు బలయ్యారు. 80 లక్షలరూపాయలు ఖర్చు చేసినా… ప్రాణాలు మాత్రం మిగలలేదు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో చోటు చేసుకుంది.

తొండుపల్లికి చెందిన పెదిరిపాటి విఠలయ్య-సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. ఏప్రిల్‌ 28న చిన్న కుమారుడు సుభాష్‌ తన 25వ వివాహ వార్షికోత్సవ వేడుకులను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆ కటుంబ సభ్యుల్లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. మే 1న సులోచన(70)ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 12న కన్నుమూశారు. అస్వస్థతకు గురైన కుమారుడు సుభాష్‌(50), కుమార్తె లావణ్య(45)లను ఆసుపత్రికి తరలించారు. 25 రోజుల అనంతరం సుభాష్‌ ఈ నెల 8న తుది శ్వాస విడవగా.. 31 రోజులు ఆసుపత్రిలో కరోనాతో పోరాడిన లావణ్య సోమవారం మృత్యువాత పడ్డారు. ఆ ఇంట్లో కుమారుడి దశదిన కర్మ రోజే కుమార్తె అంత్యక్రియలు చేయడంతో పలువురు స్థానికుల సైతం కంటతడి పెట్టారు. కరోనా బారిన పడిన సులోచన, సుభాష్, లావణ్యను బతికించుకునేందుకు నెల రోజుల పాటు కార్పొరేట్‌ అసుపత్రుల్లో రూ.80లక్షలకు పైగా ఖర్చు పెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. కరోనా ఒకే కుటుంబంలోని ముగ్గురిని బలి తీసుకోవడం విషాదం నింపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement