Friday, November 22, 2024

Hyderabad : మరో మూడు రోజులు భారీ వర్షాలు

తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా, మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లవద్దన్నారు. చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదన్నారు. కరెంట్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ముట్టుకోరాదన్నారు. వర్షం వల్ల వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో వాహనాలు నడుపాలన్నారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ 040-21111111, 9000113667ను సంప్రదించాలని సీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement