Wednesday, January 8, 2025

KNR | రైలు పట్టాలపై మూడు నెలల పసికందు..

  • రక్షించిన రైల్వే, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు.
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు.

పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): కనికరం లేని కసాయోల్లు ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును రైల్వే పట్టాల మద్యన వదిలివెళ్ళిన హృదయ విదారక ఘటన మంగళవారం పెద్దపల్లి కూనారం రైల్వే గేటు వద్ద చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్ర‌కారం…

పెద్దపల్లి పట్టణం కూనారం రైల్వే గేటు వద్ద పట్టాలపై పసిగుడ్డును చూసినవారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ డీసీపీ కమలాకర్ ఆదేశాల మేరకు 1098 హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ ఉమాదేవి, సూపర్ వైజర్ రమాదేవి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కనకరాజు పసికందును పట్టాలనుండి తీసి రక్షించారు. మూడు నెలల బాబుగా గుర్తించారు. హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో బాబును ఆసుపత్రిలో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. మూడు నెలల బాబును పట్టాల మధ్యలో వదిలివెళ్ళిన వారిని విషయం తెలిసిన వారు శాపనార్థాలు పెట్టారు. ఇంత దుర్మార్గులు కూడా ఉంటారా అని అవాక్కవుతున్నారు. వెంటనే స్పందించి బాబును రక్షించిన అధికారులను ప్రజలు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement