గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా సెగ్మెంట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థుల తరువాత నోటాకే అధికంగా ఓట్లు వచ్చాయి. మేడ్చల్ మల్గాజ్గిరి జిల్లాలో నోటాకు 15,418 ఓట్లు, రంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 12,824 ఓట్లు వచ్చాయి. నగరంలో పరిధిలో 16,222 ఓట్లు నోటాకు వచ్చాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే కుత్బుల్లాపూర్లో గరిష్ఠంగా 4079 ఓట్లు రాగా, నాంపల్లిలో 544 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలతో పోలిస్తే తాజాగా ఎన్నికల్లో నోటా ఓట్ల సంఖ్య కొద్దిగా తగ్గింది.
మేడ్చల్లో 3,737 ఓట్లు, శేరిలింగంపల్లిలో 3,145, ఎల్బీనగర్లో 2,966, మల్కాజ్ గిరిలో 2,608, కూకట్ పల్లిలో 2,458, ఉప్పల్ లో 2,536, మహేశ్వరంలో 2,031 ఓట్లు నోటాకు వచ్చాయి. పది సెగ్మెంట్లలో వెయ్యి నుంచి రెండు వేలలోపు నోటాకు వచ్చాయి. ఎల్బీనగర్లో నోటా 45 మందిని వెనక్కి నెట్టి 4వ స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో నోటాకు ఏకంగా 2,966 ఓట్లు పడ్డాయి. 33 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన మల్కాజ్ గిరిలో, 32 మంది ఉన్న ఉప్పల్ లో, 31 మంది బరిలో ఉన్న శేరిలింగంపల్లిలో అనూహ్యంగా నోటా నాలుగవ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ కావడంతో కలకలం రేగింది. ఈ నియోజకవర్గంలో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు 76,218 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి భీమ భరత్ కు 75,950 ఓట్లు వచ్చాయి. ఇక్కడ యాదయ్య మెజారిటీ 268 ఓట్లు కాగా, నోటాకు 1423 ఓట్లు రావడం గమనార్హం. దీంతో, జయాపజయాలను నిర్దేశించగలిగే స్థాయిలో నోటా ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది.