Friday, November 22, 2024

పాలేరులో ర‌స‌వ‌త్త‌ర పోరు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మరోఆరునెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్దమయ్యాయి. ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి. నియోజక వర్గాల వారిగా గెలుపు, ఓటములపై అంచనాలు వేసుకొని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. మూడో సారి అధికారం దక్కించుకోవాలని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌ ), తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి రావాలని ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సి), దక్షిణాదిలో పాగావేయడంలో భాగంగా అధికారం దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. ఇదే సందర్భంగా శాసనసభలో అడుగుబెట్టాలనే లక్ష్యంతో కమ్యూనిస్ట్‌ పార్ట్‌ ఆఫ్‌ ఇండియా (మార్స్కిస్ట్‌ ), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ), తెలుగు దేశం , వైఎస్‌ ఆర్టీపీ, తెలంగాణ జనసమితి (టీజేఎస్‌ ) తమదైన శైలిలో అడుగులువేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం ) ఇది వరకే ప్రకటిం చింది. ముఖ్యంగా వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఎట్టిపరిస్థితుల్లో అసెంబ్లిలో అడుగుబెట్టి తమ గళాన్ని వినిపించాలనే లక్ష్యంతో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌తో పొత్తులుంటే సరి లేకపోతే ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ పార్టీల సారథులు పోటీ చేసే స్థానాలపై కూడా అంచనాల మొదలయ్యాయి. ఏ నేత ఎక్కడినుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత ఇప్పటికె వచ్చింది.

అధికారికంగా ప్రకటన జరగనప్పటికీ అనధికారికంగా ఈ రెండు పార్టీల రాష్ట్ర సారథులు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లిలో అడుగుబెట్టాలనే ఇద్దరు నేతలు టార్గెట్‌తో ఉన్నారు. ఇద్దరు కూడా పూర్వ ఖమ్మం జిల్లాకు చెందిన వారే. ఎమ్మెల్యేలుగా బాధ్యతలు నిర్వహించిన నేతలే. తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు బరిలో ఉంటారు. తన పోటీపై తమ్మినేని వ్యక్తిగతంగా తాను పాలేరులో పోటీ చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ ఆయన పేరే పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించే అవకాశంఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆయన పోటీ చేయదల్చుకున్న పాలేరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రెండు లెఫ్ట్‌ పార్టీలు కలిస్తే ఎన్నిఓట్లు రావచ్చు ? బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటే పరిస్థితేంటి ? అనే విషయాలపై అంతర్గ తంగా సర్వే చేయించినట్లు సమాచారం . ఈ సర్వేలో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తే గెలుపు తథ్యమని నివేదికలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌తో పొత్తుల్లేకుం డా ఏ పార్టీకాపార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్‌ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలినట్లు తెలిసింది. ఒంటరిగా పోటీ చేస్తే బీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదని కూడా తేలింది. సీపీఐ, సీపీఎం వేర్వేరుగా చేపట్టిన సర్వేలు ఒకేలా ఉన్నట్లు సమాచారం. తమ యాత్రల సందర్భంగా ఈ రెండు పార్టీలు సర్వేలు చేయించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement